పూరీగారూ.. అవెక్కడో కాస్త మాకూ చెప్పరూ!
హైదరాబాద్: మనుషుల మధ్య దూరం పెరిగి బద్ధ వైరం ఉన్న జంతువుల మధ్య దూరం తగ్గిపోతున్న రోజులివి. ఆ విషయాన్నే రుజువు చేస్తూ కనిపించాయి ఇక్కడ ఆ జన్మ శత్రువులు. పాము, ముంగిస, కుక్క పిల్లి, పిల్లి ఎలుక ఇవంటేనే వెంటనే టకటకా శత్రువుల జాబితాలో చేరుస్తాం. కానీ, ఇప్పుడు తామే మంచి మిత్రులం అంటూ ఓ కుక్కపిల్లి నిజం చేశాయి.
ప్రతిరోజూ కుక్క కోసం పిల్లి ఇంటిపై ఎదురుచూడడం.. ఆ ఎదురుచూస్తున్న పిల్లికోసం కుక్క ఎంతో ఆతృతగా అదే సమయానికి వచ్చేసి వెంటనే ఆ పిల్లి ఉన్న ఇంటి గుమ్మం వైపు చూడటం.. అబ్బ తన మిత్రుడు వచ్చాడనుకుని ఇంటిపైన ఉన్న ఆ పిల్లి కిందికి రావడం.. ఆ తర్వాత అదే వీధిలో ఏవో సరదా కబుర్లలో మునిగిపోయి ఏం చక్కా వాకింగ్కు వెళ్లిపోవడం షరా మాములైంది.
ఇది ఏ ఒక్క రోజో కాదు. ప్రతి రోజంట. ఈ దృశ్యాలు మన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్కడ చూశారో ఏమిటో.. వెంటనే ఆ చిత్రాలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన లోకేషన్ ఎక్కడో చెప్తే ఏం చక్కా మనం కూడా అక్కడికి వెళ్లి వాటిని చూసైనా శత్రుత్వాన్ని విడిచి మిత్రలమయంగా మారిపోతాం కదా.