అర్జున్, ఐశ్వర్య
‘మీరెలాంటి ఫాదర్’ అంటే ‘మా నాన్నంత బెస్ట్ నేను కాదు’ అంటారు అర్జున్. ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తన తండ్రిని చూసి నేర్చుకున్నాను అంటున్నారు. ఇంకా అర్జున్ చెప్పిన విశేషాలు.
► ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి?
ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే మా నాన్నలా ఉండాలి. ఏ తండ్రి అయినా పిల్లలకు కొంచెం సంస్కారం ఇవ్వాలి. అది నా తండ్రి నాకు ఇచ్చారు. పిల్లలకు ఆస్తులు కూడబెట్టి ఇస్తారు కొందరు. లేనివాళ్లు ఇవ్వలేరు. అయితే సంస్కారం అనేదానికి డబ్బు అక్కర్లేదు. ఆ తండ్రి సంస్కారవంతుడు అయితే బిడ్డలకు కూడా అదే నేర్పిస్తాడు. నా తండ్రి (అర్జున్ తండ్రి జేసీ రామస్వామి నటుడు – ఆయన స్క్రీన్ నేమ్ శక్తిప్రసాద్) మాకు సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు.
► సంస్కారం ఉన్నవాళ్లు తమ సంసారం విషయంలో చాలా బాధ్యతగా కూడా ఉంటారు. కుటుంబం విషయంలో మీ తండ్రి తీసుకున్న కేర్ గురించి?
పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తండ్రి అయిపోడు. పెళ్లంటే పెద్ద బాధ్యత. భార్యని తన తల్లిలా చూసుకునేవాడే నిజమైన తండ్రి.. బిడ్డల్ని కూడా తల్లిలా చూసుకోవాలి. భార్యని, పిల్లలను సరిగ్గా చూసుకోలేనివాళ్లు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి మగవాళ్లకు పెళ్లి చేసుకునే అర్హత లేదని నా అభిప్రాయం. ఎఫెక్షన్, కేరింగ్ అనేవి చాలా ముఖ్యం. మా నాన్న చనిపోయి దాదాపు 30 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆయన తాలూకు జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉన్నాయి.
అంతలా మీ నాన్నగారు మీకోసం ఏం చేశారంటే ఒకటి, రెండు, మూడు... అని లెక్కేసి ఇన్సిడెంట్స్ చెప్పలేను. అదొక ఫీలింగ్. నేను స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అరగంట లేటైతే చాలు కంగారుపడేవారు. 5:30 గంటలకు రావాల్సింది 6 గంటలకు వస్తే నేను వచ్చేవరకూ బయట నిలబడి వెయిట్ చేస్తుండేవారు. అంత కేరింగ్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అయితే చెప్పాను కదా.. నాన్న అంటే ఓ ఫీలింగ్ అని. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో తెలియడంలేదు.
► జనరల్‌గా అమ్మ దగ్గర చనువు ఉంటుంది. నాన్నకు భయపడతాం. మరి మీరు?
మా నాన్న అంటే నాకు భయం. అయితే నేను తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడేవాడిని. లేకుంటే ఆయన మెడపై కూర్చునేటంత చనువు ఉంది. ఎప్పుడూ నన్ను భయపెట్టాలని ఓ టీచర్‌లాగా ‘ఏయ్’ అంటూ అరిచేవారు కాదు. నాతో మామూలుగా మాట్లాడేవారు. అయితే తప్పు చేస్తే నాన్నకు కోపం వస్తుంది అనే ఫీల్‌ని పిల్లలకు కలిగేలా చేయగలిగారు.
► మీ నాన్నగారు మీకు నేర్పించిన విషయాల్లో ముఖ్యమైనవి ఏమైనా?
దేశభక్తి, దైవభక్తి... రెండూ నేర్పించారు. ఈరోజు ఆధ్యాత్మికంగా ఓ గుడి (ఆంజనేయ స్వామి) కడుతున్నానంటే భక్తి అనే విత్తనాన్ని నా మైండ్‌లో చిన్నప్పుడే నాటారు నాన్న. దేశం పట్ల ప్రేమ, భక్తి ఉండాలని నా గుండెల్లో పెట్టుకునేలా చేసింది కూడా ఆయనే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి చెప్పారు. వారి త్యాగాల గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడు తెలియకుండానే ‘ఓహో... దేశం అంటే ఇది. మన స్వాతంత్య్రం వెనక ఇంతమంది త్యాగం ఉంది’ అనేది మనసులో నాటుకుపోయింది. దేశభక్తి భావం పెంపొందింది. దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమించాలని చెప్పేది కూడా నాన్నే అయ్యుండాలి. ఇలాంటి అర్హతలన్నీ ఉంటేనే ఫాదర్.. లేకుంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లనేది ఓ బాధ్యత.. ఓ కర్తవ్యం.
► అర్జున్ వాళ్ల తండ్రి గొప్పా? లేక ఐశ్వర్య (అర్జున్ కూతురు) తండ్రి గొప్పా?
ప్రపంచంలో నా తండ్రే గొప్ప అని ప్రతి పిల్లలు చెప్పుకుంటారు. నిజంగా నేను కూడా అలాగే ఫీలవుతాను.. అలాగే నేను గొప్ప తండ్రిని అనుకుంటున్నాను. మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా, చాలా సెక్యూర్డ్ ఫాదర్‌ని.. నా కూతురు పక్కన నేనుంటే తనని చూడటానికి కూడా భయపడతారు. ఇవన్నీ ఓకే.. కానీ మనం ప్రేమ ఇవ్వాలి. ప్రతి తండ్రీ ‘ఐ యామ్ ది బెస్ట్’ అంటుంటారు. మా అమ్మాయి ‘మా నాన్న బెస్ట్’ అంటుంది. అప్పుడు నేనేమన్నానంటే.. ‘నీకు నేను బెస్ట్ అయితే.. మా నాన్న నీ బెస్ట్ ఇంటూ వెయ్యి రెట్లు’ అన్నాను. మా నాన్న అంత గుడ్ ఫాదర్‌లా ఉండటానికి ట్రై చేస్తున్నాను.
► మీ నాన్నగారు సంస్కారం ఇచ్చారు. మీ పిల్లలకు మీరు అది ఇవ్వడంతోపాటు బాగా ఆస్తులు కూడా ఇచ్చారు కదా?
యస్. నా వద్ద డబ్బు ఉంది.. స్టేటస్ ఉంది. బాగా ఖర్చు పెట్టగలుగుతాను.. మా అమ్మాయి ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలను. ఫారిన్ పంపించగలను. అప్పట్లో మా నాన్నకి అంత స్తోమత లేదు.. అయినా మా నాన్నగారు బెస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఎబౌట్ మనీ, నాట్ స్టేటస్.. ఇట్స్ ఎ ఫీలింగ్. మనం పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. సమాజంలో వాళ్లు ఓ మంచి వ్యక్తిగా బతికేలా తీర్చిదిద్దుతున్నామా? లేదా? అన్నదే ముఖ్యం.
► ఇంతకీ మీ నాన్నగారు మీకు జీవితం గురించి పదే పదే చెప్పేవారా? జస్ట్ ఆయన్ని చూసి నేర్చుకోమనేవారా?
లైఫ్ అంటే ఒక ‘ఫ్లేవర్’. ఆ సువాససను మనం ఆస్వాదించగలుగుతాం తప్ప చూడలేం. వేరేవాళ్లు అడిగేటప్పుడే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. మీ ఫాదర్‌తో ఎప్పుడెప్పుడు మీకు అలా అనిపించింది? అని అడిగితే.. ఉదాహరణకి.. చిన్నప్పుడు హెయిర్ కటింగ్ షాప్‌కి నాన్న తీసుకెళ్లారు. అక్కడ కుర్చీలో ఎత్తు కోసం మరొక స్పాంజ్ సీట్ వేశారు. కటింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతూ తల కిందికి ఓ వైపు వాల్చేసేవాడిని. అప్పుడు కటింగ్ చేసే ఆయన తలని సరిగ్గా పెడతాడు. అయితే అతని చర్య సున్నితంగా ఉండదు. తలను అలా లాగి పక్కకి పెట్టినట్లు పెడతాడు. అది మా నాన్నకు నచ్చేది కాదు.
అందుకని నా పక్కనే కూర్చుని నేను నిద్రపోకుండా కథలు చెబుతూ కటింగ్ చేయించేవారు.. ఇదొక సంఘటన. ఈ విషయంలో మీకు ఏం తెలుస్తుంది.. కేరింగ్, అఫెక్షన్ తెలుస్తున్నాయి కదా. ఇంకొక్కటి చెబుతా.. ఇవన్నీ నిజాలు.. ఒకరోజు నాన్న నన్ను ఎత్తుకుని రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద ఎద్దు మీదకు వచ్చేసింది.. మా నాన్న పహిల్వాన్.. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారు. కొంచెం అయ్యుంటే అది పొడిచేసేది. దాని ముక్కుతాడుని పట్టుకుని కంట్రోల్ చేశారు.. దాని యజమాని వచ్చేవరకూ అలాగే పట్టుకుని ఉన్నారు. ఇదంతా ఒక సినిమాటిక్‌గా ఉంటుంది.
► అప్పుడు మీ నాన్నని హీరో అనుకున్నారా?
అంతేకదా! ఆయన కాకుంటే ఇంకెవరుంటారు? మా నాన్నది పల్లెటూరు. నాకూ చాలా ఇష్టం. అక్కడికి వెళ్లాలనిపిస్తుంటుంది? చెట్లు పెంచాలనిపిస్తుంది.. ఆవులు ఉండాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అది నా రక్తంలోనే ఉంది. పనసపండు ఉంటుంది కదా.. దాన్ని మా నాన్నే కోసి మా అందరికీ ఇచ్చేవారు. పిల్లలందరం కావాల్సినవి తీసుకునేవాళ్లు. మా నాన్నకి ఒక్కటే మిగిలేది. ఏమీ అనేవారు కాదు. అదే తినేవారు. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే.. ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశారాయన. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై హీరో’.
► హీరోగా మీ విజయాన్ని మీ నాన్నగారూ చూశారా?
చూశారు. పిల్లల సక్సెస్‌ని తల్లిదండ్రులు తమ విజయంగా భావిస్తారు. నేను హీరోగా నటించిన సినిమాల వంద రోజుల వేడుకలకు నాన్న వచ్చారు. వాటిలో తెలుగు సినిమా ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా ఫంక్షన్ ఒకటి. మరణం మన చేతుల్లో లేదు. నాన్న చనిపోయినప్పుడు నాకు పాతికేళ్లు కూడా ఉండవనుకుంటా. ఆయన జ్ఞాపకాలు పదిలంగా మనసులో దాచుకున్నాను.
కుమార్తె ఐశ్వర్య, భార్య నివేదితాతో అర్జున్
Comments
Please login to add a commentAdd a comment