
ఫోన్ నెంబర్ తెచ్చిన తంటా...
కేరళ తిరువనంతపురంలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న 34 ఏళ్ల మహిళకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న 34 ఏళ్ల మహిళకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మలయాళంలో ఇటీవల విడుదలైన సినిమా ఆమె జీవితంలో తీవ్ర అలజడిని రేపింది. చివరికి సమస్య పరిష్కారం కోసం ఆమె కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చింది.
విషయం ఏమిటంటే. ఈ మధ్యనే విడుదలైన 'చంద్రేట్టన్ ఇవిదేవా' అనే మలళయాళ సినిమాలోని ఒక సీన్లో ఒక ఫోన్ నెంబర్ డిస్ ప్లే అవుతుంది. అది సినిమాలోని ఒక మహిళా పాత్రధారి నంబర్. నిజానికి ఆ ఫోన్ నెంబరు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న మహిళది. పూర్తిగా పరిశీలించకుండా.. నిర్లక్ష్యంగా ఆ నెంబరును సినిమాలో ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది.
ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆమె ఫోన్ నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అర్థరాత్రి ఎవ్వడు పడితే వాడు ఫోన్ చేసి నోటికొచ్చిన బూతులు మాట్లాడటం మొదలుపెట్టారు. మరోవైపు అర్థరాత్రి ఫోన్లేంటని భర్త విసుగు. దీంతో చిరాకొచ్చిన ఆ మహిళ సదరు సినిమాకు సంబంధించిన వ్యక్తిని సంప్రదించింది. ఫోన్ నెంబర్ ఏం పాపం చేసిందండీ.. అంటూ ఆ వ్యక్తి కొట్టిపారేశాడు. దాంతో ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. లాభం లేదనుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. వారి సలహాపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇన్ని రోజులు తాను అనుభవించిన మానసిక క్షోభకు, ఎదుర్కొన్న అవమానాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కింది. అంతేకాదు ఆ సినిమాను సమీక్షించాలని కోరుతోంది.
ఆమె ఫిర్యాదుపై స్పందించిన కోర్టు, విచారణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. గతంలో ఇలాగే గజిని సినిమాలో హీరో ఒంటిపై ఉన్నఫోన్ నెంబర్లు, శివమణి సినిమాలో హీరో చెప్పిన ఫోన్ నెంబర్లు కూడా వివాదానికి దారితీశాయి. ఇక ముందు ఇలాంటి సీన్లను తీసేటపుడు దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండాల్సిందే.