
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ఫోన్ నెంబర్ ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ బలవంతపెట్టడంతో కారులో నుంచి దూకేసిందో యువతి. ఈ సంఘటన ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. ఢిల్లీలోని కపషెరకు చెందిన 19ఏళ్ల యువతి మండిహౌస్ నుంచి తన ఇంటికి వెళ్లడానికి క్యాబ్ ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత క్యాబ్ డ్రైవర్ యువతి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. యువతి అందుకు స్పందించకున్నా అది పట్టించుకోని క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా బలవంతపెట్టాడు. తనతో స్నేహం చేయాలని ఆ యువతిని బతిమాలాడు.
దీంతో కంగారు పడ్డ యువతి కారు దౌలా కౌనా బస్ స్టేషన్ వద్దకు రాగానే అందులోనుంచి కిందకు దూకేసింది. ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డ యువతి పోలీసులను ఆశ్రయించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.