
సచిన్ సినిమా పాట వచ్చేసింది
ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 44వ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలిపాటను విడుదల చేశారు. 'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు. సచిన్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో నిర్మాత రవి భగ్‌చంద్కా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే నెల 26న విడుదలకానుంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో సచిన్ బాల్యం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్య ఘట్టాల గురించిన సన్నివేశాలుంటాయి. 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్ అందుకునే దృశ్యాలను పదేళ్ల సచిన్ టీవీలో చూసే సన్నివేశం నుంచి ఓ రోజు అతనే ప్రపంచ కప్‌ను అందుకునే వరకు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాగా చిత్రీకరించారు. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.