కాటేరి చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: మా కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు డీకే. ఈయన ఇంతకు ముందు యామిరుక్కు భయమేన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా వరలక్ష్మిశరత్‌కుమార్, ఆద్మిక, మనాలి రాథోడ్ నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. పొన్నంబళం, కరుణాకరన్, రవిమరియ, జాన్‌విజయ్, కుట్టిగోపి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఎంఎస్.ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు డీకే తెలుపుతూ కాటేరి అంటే అందరూ రక్తం తాగే దెయ్యం అనుకుంటున్నారని, పూర్వ మనుషులు, ముత్తాతలు అని కూడా అర్థం ఉందన్నారు.
నిర్మాత జ్ఞానవేల్‌రాజాను కలిసి ఈ చిత్ర ఒన్‌లైన్ కథను చెప్పానన్నారు. ఆయకు నచ్చడంతో పాటు కాటేరి అనే టైటిల్ ఈ కథకు బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో కాస్త స్వార్థం కలిగిన అమ్మాయిగా సోనం బాజ్వా, మనోతత్వ వైద్యురాలిగా ఆద్మిక నటిస్తున్నారని, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, మానాలి రాథోడ్‌లు 1960 కాలానికి చెందిన పోర్షన్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తన గత చిత్రం యామిర్కు భయమేన్ చిత్రంలో పాపులర్ అయిన పన్ని మూంజి వాయన్ లాంటి పాత్ర ఈ చిత్రంలోనూ చోటు చేసుకుంటుందన్నారు. కాటేరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పిల్లలను అలరిస్తుందని చెప్పారు. తమ కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment