‘త్రిపుర’ సమస్య ఏంటి?
‘త్రిపుర’ అనే అమ్మాయి జీవితం చుట్టూ అంతు చిక్కని ప్రశ్నలు మబ్బుల్లా కమ్ముకున్నాయి. ఆ ప్రశ్నలేంటి? అసలు త్రిపుర సమస్య ఏంటి? అనే కథాంశంతో ‘గీతాంజలి’ ఫేం రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘త్రిపుర’. టైటిల్ రోల్‌లో స్వాతి నాయికగా క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం.రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది.
తమిళ చిత్రానికి ‘తిరుపుర సుందరి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో పాటలను చిత్రీకరించనున్నారు. ‘‘హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్వాతి నటన ఈ చిత్రానికి హైలైట్. పాటల చిత్రీకరణను బెంగళూరులోని హంపి, బదామీలో జరపనున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. పూర్తయినంతవరకు రషెస్ చూశామని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సమర్పణ: జె.రామాంజనేయులు.