త్రిపురకు అతనే హీరో - దాసరి
‘‘నాకు రాజమౌళి, శేఖర్ కమ్ముల, క్రిష్ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడనే పదానికి నిజమైన అర్థం తీసుకొచ్చారు. వారిలో రాజకిరణ్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి అతనే హీరో. రాజకిరణ్ రూపొందించిన ‘గీతాంజలి’ చూశాను. స్వాతి కళ్లు చాలా డేంజరస్. ఈ చిత్రానికి సరిగ్గా సూట్ అవుతాయి. విపరీతమైన పోటీ ఉన్న ఈ కాలంలో నవీన్ చంద్ర చాలా కష్టపడి నిలదొక్కుకుంటున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. స్వాతి, నవీన్‌చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించారు.
క్రిష్ మాట్లాడుతూ-‘‘నాకు దెయ్యాల సినిమాలంటే చాలా భయం. ‘అరుంధతి’ సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే నేను సీట్లో కాళ్లు పెట్టుకుని మరీ చూశాను. ‘గీతాంజలి’ సినిమా చూస్తున్నప్పుడు పడీ పడీ నవ్వాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రాజకిరణ్ నాకు ‘గీతాంజలి’ కథ చెప్పినప్పుడు ‘త్రిపుర’ అనే టైటిల్ చెప్పారు. తర్వాత ఈ సినిమా కథను చెప్పి ‘త్రిపుర’ టైటిల్ చెప్పారు.
ఇది అతనికి బ్రహ్మాస్త్రం లాంటి కథ. తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజకిరణ్ ఎంత చక్కగా కథ చెప్పారో, అంత కన్నా బాగా తెరపై ఆవిష్కరించారు. కమ్రాన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని స్వాతి చెప్పారు. రాజకిరణ్, రచ యిత వెలిగొండ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ మల్లాల తదితరులు పాల్గొన్నారు.