రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గోల్‌మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ ఏడాది బాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఈ క్రమంలో 'గోల్‌మాల్ అగైన్' ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అజయ్-రోహిత్ కాంబో మరోసారి తమపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంది. 'గోల్‌మాల్' సిరీస్ మరో బంపర్ విజయాన్ని అందుకుంది. 'గోల్‌మాల్-3' తర్వాత నాలుగో పార్టు కూడా వరుసగా వందకోట్ల క్లబ్బులో చేరడం గమనార్హం.
ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 30.10 కోట్లు, శనివారం రూ. 28 కోట్లు, ఆదివారం రూ. 29.09 కోట్లు, సోమవారం రూ. 16.04 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా రూ. 103.64 కోట్లుసాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. సోమవారం సైతం ఈ సినిమా రూ. 16 కోట్లకుపైగా వసూలు చేయడం ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్‌మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్‌మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్‌మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్‌మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment