రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గోల్‌మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయని తెలుస్తోంది. తొలిరోజు ఈ సినిమా రూ. 33 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్‌మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. చిన్న సినిమాగా విడుదలైన 'సీక్రెట్ సూపర్‌స్టార్' తొలిరోజు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. రెండురోజు ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగి రూ. 9 కోట్లు రాబట్టింది. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సీక్రెట్ సూపర్‌స్టార్ రూ. 13 కోట్లు రాబట్టగా.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్‌మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. ఆమిర్ సినిమా రాకపోయి ఉంటే ఈ సినిమా తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 45 కోట్లు రాబట్టి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు చెప్తున్నాయి.
రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్‌మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్‌మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment