Goodachari Review, in Telugu | 2018 | ‘గూఢచారి’ తెలుగు మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘గూఢచారి’ రివ్యూ : ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ మూవీ

Published Fri, Aug 3 2018 12:37 PM | Last Updated on Sat, Aug 4 2018 10:47 AM

Goodachari Telugu Movie Review - Sakshi

టైటిల్ : గూఢచారి
జానర్ : స్పై థ్రిల్లర్‌
తారాగణం : అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకల
దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
నిర్మాత : అభిషేక్‌ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్‌

క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తానే లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించాయి. శశి కిరణ్ దర్శకుడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.? రచయితగా అడివి శేష్‌ మరోసారి విజయం సాధించాడా..?

కథ ;
గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్‌ చనిపోతాడు. దీంతో రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్‌ కుమార్‌ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్‌ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్‌ రాదు. (సాక్షి రివ్యూస్‌) ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకుని అని మెన్షన్‌ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్‌ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్‌ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్‌ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్‌.. త్రినేత్ర 11గా అపాయింట్‌ అవుతాడు.

కానీ అర్జున్‌ అపాయింట్‌ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్‌ అవుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్‌ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్‌ బైక్‌ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్‌ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్‌ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్‌ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అసలు ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్లు అర్జున్‌ చేసినట్టుగా ఎందుకు సృష్టించారు..? అర్జున్‌ ఈ మిస్టరీని ఎలా చేదించాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
బాండ్‌ తరహా కథ కావటంతో సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్‌ బాండ్‌లా అడవి శేష్‌ అద్బుతంగా నటించాడు. యాక్షన్, రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. తనే రాసుకున్న కథా కథనాలు కావటంతో అవకాశం ఉన్న ప్రతీ చోట తనని తాను చాలా బాగా ఎలివేట్ చేసుకున్నాడు. సినిమాలో జగపతి బాబు ఎంట్రీ ఆడియన్స్‌ కు షాక్‌ ఇస్తుంది. మరోసారి ప్రతినాయక పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్‌ పాత్రలో ఆమె నటన సూపర్బ్‌. నెగెటివ్‌ షేడ్స్‌ ను కూడా చాలా బాగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. ఆమె.. గ్లామర్‌ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్‌ రాజ్‌, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
 

విశ్లేషణ ;
తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు చాలా ఏళ్ల కిందటే వచ్చినా.. ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి ఓ రేర్‌ కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్‌.. మనం కూడా బాండ్ సినిమాలను తెరకెక్కించగలమని మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్  గా అనిపించినా.. సెకండ్‌ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్‌ చూసిన తరువాత లవ్‌ సీన్స్‌ కూడా ఓకె అనిపిస్తాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫి, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్‌ శానెల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్‌ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్‌.


ప్లస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్ నటన
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
లవ్ సీన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement