ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు! | Gopichand Ready for Revolutionary Movies | Sakshi
Sakshi News home page

ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు!

Published Sat, Apr 4 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు!

ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు!

 ‘‘ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మా నాన్నగారు (టి. కృష్ణ) తన సినిమాల్లో చర్చించిన అంశాలు నేటి సమాజంలోనూ ఉన్నాయి. అలాంటి అంశాలతో విప్లవాత్మక సినిమాలు చేసే అవకాశం వస్తే, చేయడానికి నేను రెడీగా ఉన్నా’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఓ డిఫరెంట్ లుక్‌లో ఫైర్ ఆఫీసర్‌గాగోపీచంద్ నటించిన ‘జిల్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘‘దర్శకుడు రాధాకృష్ణకుమార్ చెప్పిన కథను నమ్మి నేనీసినిమా చేశా. నా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయలేదు’’ అని గోపీచంద్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు.
 
  నా గత చిత్రం ‘లౌక్యం’ ఫుల్‌కామెడీ మూవీ. మళ్లీ అలాంటి సినిమాయే చేస్తే రొటీన్‌గా ఉందంటారు. అందుకే ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఉన్న కథను రాధాకృష్ణకుమార్ చెప్పడంతో అంగీకరించాను. ‘జిల్’ అంటే ఓ ఎక్స్‌ప్రెషన్. రకరకాల సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి ‘జిల్లుమనిపించింది’ అంటుంటాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల అలా అనుకుంటాం. వాస్తవానికి ఇప్పటివరకూ నేను పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదు.
 
 ‘జిల్’ ఆ కొరత తీర్చింది. అలాగే, నాకు తెలిసి ఈ తరంలో తెలుగులో ‘ఫైర్ ఆఫీసర్’ పాత్రతో సినిమాలు రాలేదు. సినిమా మొత్తం చక్కని ఎమోషన్‌తో ఉంటుంది. అది బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం ఉంది. కానీ, దాన్ని ప్రాపర్ ‘లిప్ లాక్’ అనలేం. అప్పటికీ ఈ సీన్ అవసరమా? అనడిగాను. కానీ, అది లేకపోతే సీన్ పండదని దర్శకుడు అన్నాడు. అందుకని చేశాను. పబ్లిసిటీ కోసం చేసిన సీన్ కాదది.
 
 గత పదిహేనేళ్లుగా నా లుక్‌లో నేనెలాంటి మార్పు చేయలేదు. అందుకే, ఈ చిత్రం చూసినవాళ్లు ముందు నా లుక్ గురించి మాట్లాడుతున్నారు. అదే సినిమా నచ్చకపోతే, లుక్ డిఫరెంట్‌గా ఉన్నా ఆదరించరు. వాస్తవానికి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లుక్ మార్చాలని చెబితే, నేను సంశయించాను. దాంతో ప్రభాస్‌తో చెప్పించారు. తనేమో ‘రేయ్... లుక్ మార్చరా.. బాగుంటుంది’ అన్నాడు. సరే.. మార్చాను. లుక్ టెస్ట్ చేసినప్పుడే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం కుదిరింది. ఇప్పటివరకూ నీ కెరీర్‌లో ఇదే ‘బెస్ట్ లుక్’ అని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమా చూసి, ‘లుక్ అదిరింది.. ఫైట్స్, డాన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది’ అన్నాడు.
 
 నేను, ప్రభాస్ మంచి స్నేహితులం. మా ఇద్దరికీ తగ్గ కథ కుదిరితే చేయాలనుకుంటున్నాం. కానీ, ఇప్పటివరకూ కథ దొరకలేదు. వాస్తవానికి మనకు కథల కొరత ఉంది. తెలుగు పరిశ్రమలో రచయితలు తక్కువయ్యారు. ఎవరైనా కథలు రాయాలనుకుంటే, ఏ హాలీవుడ్ సినిమానో, వీడియోనో చూస్తే సరిపోదు.. సమాజాన్ని చదవాలి. సమాజంలో జరుగుతున్న సమస్యలను తెలుసుకోవాలి. జనాల్లోకి వెళితే బోల్డన్ని కథలు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా విప్లవాత్మక చిత్రాలు చేయాలంటే మాత్రం జనాలను పరిశీలించాల్సిందే. ఇప్పడీ తరహా చిత్రాల కొరత ఉంది కాబట్టే, చేస్తే మాత్రం హిట్ గ్యారంటీ అనొచ్చు.
 
  ఒకసారి కథ విని, ఓకే చెప్పిన తర్వాత షూటింగ్ స్పాట్‌లో మార్పులు చెప్పడం నాకిష్టం ఉండదు. అలాగే, నా కారణంగా నిర్మాణ వ్యయం పెరగకుండా జాగ్రత్తపడతాను. అయితే, ఒక సినిమా బడ్జెట్ పరిధులు దాటకుండా ఉండటం అనేది నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. దేనికి ఎంత ఖర్చుపెట్టాలనే విషయం మీద నిర్మాతకు నియంత్రణ ఉండాలి.
 
  ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో అంగీకరించిన చిత్రం కాదిది. ఇది వేరే కథతో రూపొందిస్తున్నాం. వక్కంతం వంశీ కథ ఇచ్చారు. ఇది మంచి లవ్ మరియు ఫ్యామిలీ మూవీ. అన్నీ కుదిరితే ఈ జూలైలో విడుదల ఉంటుంది. ఈ చిత్రం తర్వాత భవ్య క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నా. మంచి కథలు కుదిరితే ఏడాదికి మూడు సినిమాలు చేయొచ్చు. కానీ, కథలు కుదరడంలేదు.
 
  పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జీవితం ఒకేలా ఉంది. అయితే అంతకు ముందు పెద్దగా బాధ్యతలు ఉండేవి కాదు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నాను. దూర ప్రాంతాలకు షూటింగ్‌కి వెళ్లినప్పుడు, మా అబ్బాయి విరాట్ కృష్ణ గుర్తొస్తుంటాడు. ‘ఇప్పుడేం చేస్తున్నాడో’ అని ఆలోచించుకుంటుంటా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement