కీర్తిసురేష్‌కు తలకట్టు తీర్చిదిద్దుతున్న స్టైలిస్ట్
తెరపై మెరవాలంటే ఆహార్యం అదిరిపోవాలి. సినిమాకో గెటప్‌లో ప్రేక్షకులను అలరించాలి. శోభన్‌బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎస్వీఆర్, కృష్ణ... ఇలా ఎందరికో విభిన్న లుక్‌లిచ్చి, తెరపై క్లిక్‌మనిపించిన ఘనత కృష్ణానగర్‌కే దక్కింది. రింగురింగుల జుట్టుతో శోభన్‌బాబును, గుబురు జుట్టుతో ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపించిన ప్రతిభ ఇక్కడి ఆర్టిస్టులకే సొంతమైంది. ఆనాటిసినిమాల నుంచి నేటి బాహుబలి వరకు హీరోహీరోయిన్లగెటప్‌లకు సంబంధించి అన్నీ కృష్ణానగర్‌నే అందించింది.అయితే పరిస్థితులు మారాయి. పద్ధతులు మారాయి.ఫ్యాషన్ మారింది. కట్టుబొట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి.కానీ పని మాత్రం ఇక్కడి నుంచే కొనసాగడం విశేషం.
బంజారాహిల్స్: తెరపై కథానాయకులు, కథానాయికల వేషధారణ ఎంతో ముఖ్యం. తలకట్టుతో పాటు డ్రెస్సింగ్ ఇందులో కీలకం. ఒకప్పుడు విగ్గుల నుంచి మొదలు వేషధారణలకు అనుగుణంగా రూపొందించే దుస్తుల డిజైన్లన్నీ కృష్ణానగర్‌లోనే రూపుదిద్దుకునేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, ఎస్వీఆర్, కాంతారావు.. ఇలా ఎంతోమంది కథానాయకులకు కావాల్సిన విగ్గులను ఇక్కడి వారే తయారు చేసి అందించేవారు. ఒకప్పుడు విగ్గులను పెట్టడం చాలా కష్టంగా ఉండేది. పాతికేళ్ల కిందట విగ్గులను నట్ల సాయంతో అమర్చేవారు. దీంతో ధరించే వారికి కొంత భారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నట్ల స్థానంలో క్లిప్పులు వచ్చాయని చెప్పారు కృష్ణానగర్‌లోని శ్రీసాయి విగ్స్ నిర్వాహకులు ఎ.సుబ్బారావు. ఒకప్పుడు విగ్గు తయారు చేయడం చాలా కష్టంగా ఉండేదని, చెన్నై నుంచి జుట్టు దిగుమతి చేసుకొని రూపొందించే వాళ్లమని పేర్కొన్నారు.
ఎన్నెన్నో మార్పులు...
అప్పట్లో విగ్గులను కేవలం జుట్టుతోనే రూపొందించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో సింథటిక్, హ్యూమన్ హెయిర్ విగ్స్, ఆర్గానిక్ విగ్స్... ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటికి అవసరమైన కలరింగ్‌తో కూడిన విగ్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు కృష్ణానగర్‌లోనే తయారు చేసి ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తున్నారు. కానీ డిజిటల్ మార్పుల నేపథ్యంలో హెయిర్ డిజైన్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. వారి పాత్రకు అనుగుణంగా తమ తలకట్టును తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌లు ఇక్కడికి వచ్చేస్తున్నారు.
నయా డిజైన్స్ ఆగయా...
సినిమాల్లోని వివిధ వేషధారణలకు కావాల్సిన దుస్తులను కృష్ణానగర్‌లో అద్దెకిస్తారు. డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లాయర్... ఇలా ఏ పాత్రకైనా నిమిషాల్లో దుస్తులను సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైన దుస్తులు ఇక్కడి నుంచే అందిస్తున్నా... వాటి రూపురేఖలు మారుతున్నాయి. నవతరం డిజైనర్లు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడి స్టైలిస్టులతోనే నూతన డిజైన్స్‌కు అనుగుణంగా దుస్తులను తీర్చిదిద్దుతున్నారు. డ్రెస్సుల డిజైనింగ్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని కృష్ణానగర్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఖాదర్ పేర్కొన్నారు. ప్రస్తుత హీరోహీరోయిన్లు తమకు కావాల్సిన డ్రెస్సులను డిజైనర్లతో డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పారు.
ఇప్పుడంతా నెట్‌లోనే...
ఒకప్పుడు స్థానిక హైయిర్ స్టైలిస్టులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ కోసం 180 డిజైన్లను పరిశీలించాం. గతంలో సొంతంగా ఆలోచించి డిజైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఇంటర్నెట్‌లోనే పరిశీలిస్తున్నాం. గ్రాఫిక్స్‌లోనే హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే చూపిస్తున్నాం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్
డిజైన్ వారిది.. తయారీ మాది
సినీ ఇండస్ట్రీతో దాదాపు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఎంతోమంది నటీనటులకు డ్రెస్సులను డిజైన్ చేశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా డిజైనర్లు వచ్చారు. వారి రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా మేము దుస్తులను తయారు చేస్తున్నాం. గతంలో అయితే మా అభిరుచి మేరకు మేమే రూపొందించేవాళ్లం.
– ఖాదర్, కాస్ట్యూమ్ డిజైనర్
ట్రెండ్స్‌కు అనుగుణంగా...
విగ్గుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు విగ్గు కావాలంటే నలుపుదో, తెలుపుదో ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా విగ్గుల రంగులు, స్టైల్స్ మారాయి. ఆయా మార్పులకు అనుగుణంగా తయారు చేసిస్తున్నాం. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కావాల్సిన సింథటిక్ జుట్టును తీసుకొస్తున్నాం.
– సుబ్బారావు, శ్రీసాయి విగ్స్
గిరాకీ తగ్గింది...
నేను 20ఏళ్లుగా కృష్ణానగర్‌లో షాపు ఏర్పాటు చేసుకొని సినిమా వేషాలకు కాస్ట్యూమ్స్ అద్దెకిస్తున్నాను. అప్పట్లో నా దగ్గరే పాత్రలకు తగిన విధంగా డ్రెస్సులు ఉండేవి. వాటినే అద్దెకు తీసుకొనేవారు. అయితే దశాబ్ద కాలంగా హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సొంతంగా కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించుకుంటుండడంతో మాకు గిరాకీ తగ్గింది.
– సంగప్ప, కాస్ట్యూమ్స్ విక్రేత
Comments
Please login to add a commentAdd a comment