హవా హవాయి... ఒక రకంగా చెప్పాలంటే బాల కార్మిక వ్యవస్థ మీద లెన్స్ పెట్టిన చిత్రం ఇది. పిల్లలకు ఆశలుంటాయి. ఊహలుంటాయి. వాటికి రెక్కలు తొడుగుతారు. నింగిని దాటి ఎగరాలనుకుంటారు. కాళ్లకు చక్రాలు కడ్తారు. భూమిని మొత్తం చుట్టి రావాలనుకుంటారు. ఆ ఉత్సాహాన్ని మనం గమనిస్తే.. వాళ్ల ఆలోచనలకు దిశ చూపిస్తే.. సముద్రం అంచును కనుక్కోగలరు.. ఆకాశం చివరను చూపించగలరు.
కాని అలాంటి పిల్లలను పరిస్థితులు బాల కార్మికులను చేస్తే.. ఆ బాల్యం చెత్త కుప్పలో మురిగిపోతుంది.. గ్యారేజ్‌లలో తుప్పు పడ్తుంది.. ఫుట్‌పాతల ఫేట్‌ను రాసుకుంటుంది.. హోటళ్లలో కుళ్లిపోతుంది.. టీ కొట్టుల్లో చేయి కాల్చుకుంటుంది... దేశం అద్భుతమైన భవిష్యత్‌ను కోల్పోతుంది.. అని హెచ్చరిస్తుంది ‘హవా హవాయి’ సినిమా!
ఇక కథలోకి..
హరిశ్చంద్ర వాఘ్మేర్ (మకరంద్ దేశ్‌పాండే) ఒక పత్తి రైతు. అప్పులపాలై ఉన్న పొలాన్ని అమ్మేసుకుంటాడు. ఆ బాధతోనే అదే పొలంలో గుండె పగిలి చనిపోతాడు. దాంతో ఆ కుటుంబం ముంబై వలస వస్తుంది. మురికివాడలో నివాసముంటుంది. హరిశ్చంద్ర వాఘ్మేర్ కొడుకు అర్జున్ ఓ స్కేటింగ్ కోచింగ్ సెంటర్ దగ్గరున్న టీ కొట్టులో జీతానికి కుదుర్తాడు. అదే మురికివాడలో ఉంటూ గ్యారేజ్‌లో, ఫుట్‌పాత్ మీద పూలు అమ్ముకునే, చెత్త ఏరుకునే, మగ్గం పనిచేసే అబ్బాయిలతో స్నేహం కుదురుతుంది అర్జున్‌కి. దొరికింది కలిసి తింటారు. కలిసి ఆడుకుంటుంటారు. కలిసి కలలు పంచుకుంటుంటారు. ఒకళ్లకొకళ్లు భరోసా ఇచ్చుకుంటుంటారు.
స్కేటింగ్..
టీ కొట్టు దగ్గరున్న గ్రౌండ్‌కు సాయంకాలాలు పిల్లలొస్తుంటారు స్కేటింగ్ నేర్చుకోవడానికి. అనికేత్ భార్గవ (సాఖీబ్ సలీమ్) అనే స్కేటింగ్ చాంపియన్ వాళ్ల కోచ్. లక్కీ సర్‌గా పిల్లలకు సుపరిచితం. అతని తల్లిదండ్రులు ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. అన్న అనిరుద్ధ భార్గవ(అనూజ్ సచ్‌దేవ) ఉంటాడు. అతనికి న్యూయార్క్‌లో ఉద్యోగం. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇండియాకు వస్తాడు. తమ్ముడిని తీసుకొని న్యూయార్క్ వెళ్లాలనుకుంటాడు. కాని లక్కీ ఉరఫ్ అనికేత్‌కు స్కేటింగ్ అంటే ప్రాణం. రాలేను అంటాడు.
చివరకు సముదాయించి ఒప్పిస్తాడు. ఈ లోపే అర్జున్.. తను పనిచేసే చోట పిల్లలంతా కాళ్లకు చక్రాల బూట్లు కట్టుకొని అలా గాల్లో తేలిపోయినట్టు సర్రుమని జారిపోతుంటే చూసి భలే ముచ్చటపడ్తాడు. ఆ ఆట గురించి తన సావాసగాళ్లకు కథలు కథలుగా చెప్తుంటాడు. తనూ అలా గాల్లో తేలిపోయినట్టు.. సర్రున జారిపోయినట్టు ఊహించుకుంటుంటాడు. టీ కొట్టులో స్కేటింగ్ షూతోనే టీ సర్వ్ చేస్తున్నట్టు భావిస్తుంటాడు. ఇంట్లో ఉన్నా.. తింటున్నా.. పడుకుంటున్నా.. స్కేహితులతో ఆడుకుంటున్నా.. అదే ధ్యాస. స్కేటింగ్ ధ్యాస.
హవా హవాయి..
అర్జున్ పిచ్చి చూసి వాడికోసం ఎలాగైనా స్కేటింగ్ షూ కొనాలని నిర్ణయించుకుంటారు అతని ఫ్రెండ్స్. తలా పది రూపాయలు వేసుకొని వాళ్లు పనిచేసే చోట ఒక గంట అనుమతి తీసుకొని స్పోర్ట్స్ షాప్‌కి వెళ్తారు. వాటి ధర 30 వేల రూపాయలని విని విస్తుపోతారు పిల్లలు. అలాగే వెనక్కి వస్తారు. ఆలోచిస్తారు ఏం చేయాలి అని! చెత్త ఏరుకునే కుర్రాడు చెత్తలో పాడైపోయిన స్కేటింగ్ షూ చక్రాలు వెదికి పట్టుకొస్తాడు. మగ్గం పని చేస్తున్న కుర్రాడు అందమైన గుడ్డ ముక్కలు తెస్తాడు. గ్యారేజ్‌లో పనిచేస్తున్న కుర్రాడు తన పాడైపోయిన షూని కుట్టి.. వాటికి ఈ చక్రాలు అమర్చి.. ఆ గుడ్డముక్కతో అందంగా ముస్తాబు చేస్తాడు.
వాటికి ‘హవా హవాయి’ అని పేరు పెడ్తారు. అందరూ కల్సి ఓ రాత్రి ఆ షూను పాదాలకు కట్టుకొని నడిచేందుకు ప్రయత్నిస్తారు. బ్యాలెన్స్ చేసుకోలేక అందరూ పడిపోతారు ఒక్క అర్జున్ తప్ప. అది మొదలు రోజూ అలా కట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటాడు అర్జున్. ఒక రోజు రాత్రి.. గ్రౌండ్‌లో లక్కీ సర్.. పిల్లలకు కోచింగ్ ఇస్తుంటే అర్జున్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడికి హెల్మెట్, ఓ జాకెట్ వేసి.. స్కేటింగ్ షూ తొడిగి.. తోపుడు బండి తెచ్చి.. వాడిని ఎక్కిస్తారు. దాని మీద నుంచి స్కేటింగ్ చేస్తూ గాల్లో ఎగిరి గ్రౌండ్‌లోకి దూకుతాడు అర్జున్.
దూకి అలాగే స్కేటింగ్ చేస్తుంటాడు. లక్కీ సర్ సహా వాళ్ల స్టూడెంట్స్ అంతా అర్జున్ స్టంట్‌కి నోరెళ్లబెడ్తారు. వాడి వేగం.. ఒడుపు చూసి ముచ్చట పడ్తాడు లక్కీ. వివరాలు తెలుసుకుంటాడు. స్కేటింగ్ అంటే అర్జున్‌కున్న ఆసక్తి అర్థమై కోచింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఓ వీధి కుర్రాడికి కోచింగ్ ఇచ్చి వాడిని ఛాంపియన్ చేసిన ఘనతను సొంతం చేసుకోవాలని తహతహలాడుతుంటాడు. టీ కొట్టులో పనైపోయాక రాత్రి కోచింగ్ తీసుకునేట్టు ఒప్పందం కుదుర్చుకుంటాడు అర్జున్. ఈ అగ్రిమెంట్‌తో వాళ్లన్నతో కలిసి వెళ్లాల్సిన అమెరికా ప్రయాణాన్ని మానుకుంటాడు లక్కీ.
నిద్రాహారాలు మాని..
కోచింగ్ సాగుతుంటుంది. పొద్దునంతా పని.. రాత్రి కోచింగ్‌తో అలిసిపోయి ఇంటికి వెళ్తుంటాడు అర్జున్. దాంతో రాత్రి వాళ్లమ్మ అన్నం పెట్టేలోపే నిద్రపోతుంటాడు. మళ్లీ ఉదయమే హడావిడిగా పనికి వెళ్లడం. ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా.. ప్రాక్టీస్ చేసుకోవడం.. ఇదే దినచర్య అవుతుంది అర్జున్‌కి. రోజు రోజుకూ స్కేటింగ్‌లో మెరుగుపడ్తుంటాడు అర్జున్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్‌కు తయారు చేయాలనుకుంటాడు లక్కీ. ప్రాక్టీస్ పెంచుతాడు. అర్జున్‌లో అలసటా పెరుగుతుంది. అయినా ప్రాక్టీస్‌ను నిర్లక్ష్యం చేయడు.
అయితే ఈ క్రమంలో నిద్రాహారాలను మానేస్తాడు. తీరా కాంపిటీషన్ రోజు కళ్లు తిరిగి పడిపోయి.. పోటీకి వెళ్లలేకపోతాడు. కోచ్‌కి కోపం వస్తుంది. వీధి కుర్రాడిని నమ్మడం తన తప్పే అని ఆవేశం తెచ్చుకుంటాడు. వాళ్లింటిని వెదకడానికి వెళ్తాడు. ఇంతలోకే అర్జున్ ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది.. అర్జున్ కళ్లు తిరిగి పడిపోయాడని. వాళ్లతో పాటు అర్జున్ దగ్గరకు వెళ్లి హాస్పిటల్‌లో చేర్పిస్తారు. అప్పుడు తెలుస్తుంది అర్జున్ వాళ్లమ్మకు, కోచ్‌కు ఆ అబ్బాయి తిండి, నిద్ర మానేసి ప్రాక్టీస్ చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యాడని.
పోషకాహార లోపంతో ఉన్నాడని. షాక్ అవుతాడు లక్కీ. ఆ పిల్లాడికున్న తపనను బలహీనతగా చేసుకొని.. వాడిని స్కేటింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్ది ఓ వీధి బాలుడికి జీవితం ఇచ్చానన్న కీర్తిని సొంతం చేసుకోవాలనుకున్నాడే కాని.. వాడికి నిజంగానే ఏం అవసరం? ఎలాంటి స్థితిలో ఉన్నాడు.. అనేది ఒక్కసారైనా ఆలోచించలేదని పశ్చాత్తాప పడ్తాడు. తన స్వార్థాన్ని తలచుకొని తనను తానే అసహ్యించుకుంటాడు. రాత్రింబవళ్లు అర్జున్ దగ్గరుండి.. అతని ఆరోగ్యం బాగయ్యేలా చూస్తాడు. ఆ క్రమంలో అర్జున్ ఫ్రెండ్స్ అర్జున్ కోసం పడుతున్న ఆరాటం చూసి చలించిపోతాడు. వాళ్లందరి జీవితాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకోవాలనుకుంటాడు నిస్వార్థంగా.
బడిలో.. గ్రౌండ్‌లో..
ఆరోగ్యం కుదుట పడ్డ అర్జున్ తన కోచ్ ఆశను నెరవేర్చలేకపోయానని కుమిలిపోతుంటాడు. ‘‘డిస్ట్రిక్ట్ పోతే స్టేట్ ఉంది.. నువ్వేం టెన్షన్ పడకు.. ముందు హెల్తీగా తయారవ్వు’’ అని భరోసా ఇస్తాడు కోచ్. అన్నట్టుగానే అర్జున్ బాగవగానే అతనితో సహా అతని ఫ్రెండ్స్ అందరినీ స్కూల్లో చేర్పిస్తాడు. అర్జున్‌కు మళ్లీ కోచింగ్ మొదలుపెడ్తాడు. లక్కీ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న మిగిలిన పిల్లలంతా అర్జున్‌కి అండగా నిలుస్తారు. ఆ పిల్లల నిష్కల్మషమైన.. నిస్వార్థమైన స్నేహాన్ని చూసి లక్కీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ పిల్లలు చూపిస్తున్న ప్రేమ ముందు తాను చేస్తున్న పని చిన్నదిగా కనిపిస్తుంటుంది.
పెద్దాళ్లు పిల్లలను ఎంత చెడగొడ్తున్నారో అర్థమవుతుంటుంది. మొత్తమ్మీద స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కు అర్జున్ తయారవుతాడు. పోటీ రోజు.. తండ్రి మరణమప్పుడు తమ నిస్సహాయతను తలచుకుని రేస్‌లో స్కేట్ చేస్తాడు అర్జున్. మొదటి స్థానంలో నిలుస్తాడు. ఆ గెలుపు తర్వాత విజయాలకు మొదటి మెట్టవుతుంది అర్జున్‌కి. అతను స్టేట్ లెవెల్ స్కేటింగ్ చాంపియన్ అవుతాడు. ఆ టీ కొట్టులో అర్జున్ స్థానంలో ఓ వయసు మళ్లిన వ్యక్తి టీ సర్వ్ చేస్తూ కనిపించడం ఈ సినిమాకు కొసమెరుపు. ‘హవా హవాయి’ సినిమాను ‘స్టాన్లీకి డబ్బా’ సినిమా తీసిన అమోల్ గుప్తే నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇది అమేజాన్ ప్రైమ్‌లో దొరకొచ్చు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment