ఆయన్ను ఇరిటేట్ చేశాను!
‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో ‘నాన్నా.. పూలు’ అని తండ్రిని ఏడిపించిన బుడతడు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు తనే హీరోగా మన ముందుకు రానున్నాడు. నాగ అన్వేష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘వినవయ్యా రామయ్య’ నేడు తెరకొస్తోంది. ‘సిందూరపువ్వు’వంటి ఘనవిజయం అందించిన నిర్మాత కృష్ణారెడ్డి తనయుడే ఈ నాగ అన్వేష్. తనయుడు హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక, నాగ అన్వేష్ చెప్పిన ముచ్చట్లు..
*** చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అరుణ్ పాండ్యన్ హీరోగా చేసిన ఓ సినిమాలో బాలనటుడిగా చేశా. ఆ సినిమా పేరు గుర్తు లేదు. ఆ సినిమా చూసి, ఈవీవీ సత్యనారాయణగారు నన్ను ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ సినిమాకి తీసుకున్నారు. ఆ సినిమా సెట్‌లో తెగ అల్లరి చేసేవాణ్ణి. ఇక వెంకటేశ్ అంకుల్‌నైతే ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇరిటేట్ చేసేవాడిని. సౌందర్య ఆంటీ కూడా బాగా గారం చేసేవారు. ఆ చిత్రం తర్వాత ‘ఆయనగారు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, సైనికుడు (సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం), ‘సాహసబాలుడు విచిత్రకోతి’ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, చదువు కొనసాగించాను.
*** నేను సీబీఐటీలో బీటెక్ చేశాను. కాలేజీలో కూడా నా మనసంతా సినిమాల పైనే. మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయడంతో హీరోగా అడుగులు వేయాలనుకున్నాను. దాంతో యాక్టింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు రామ్‌ప్రసాద్‌గారు ఈ కథ చెప్పారు. కథ బాగుండటంతో నాన్న ఓకే అన్నారు.
*** ఈ చిత్రంలో బ్రహ్మానందం అంకుల్ కాంబినేషన్‌లో నటించాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను హీరో అవుతానని చెప్పగానే... ‘హీరో అంటే ఎలా ఉండాలి? ఎలాంటి కథలు తీసుకోవాలి?’ అనే అంశాల గురించి చెప్పారు. బ్రహ్మానందంగారు నాకు గురువులాంటివారు. ప్రకాశ్‌రాజ్‌గారైతే ఏ సీన్‌లో ఎలా నటించాలి? అనే అంశాలపై చాలా సూచనలు, సలహాలు ఇచ్చారు. వాళ్లతో పనిచేయడం మర్చిపోలేని అనుభవం.
*** రామ్‌ప్రసాద్‌గారు ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. లవ్ ట్రాక్, కామెడీతో సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు స్క్రిప్టే హీరో. ఈ సినిమా షూటింగ్ చాలా ఆహ్లాదంగా గడి చిపోయింది. నేను, కృతిక చిన్నవాళ్లమైనా చిత్ర బృందం అంతా చాలా బాగా సహకరించారు. పతాక సన్నివేశాల్లో ఆ అమ్మాయి నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. వినాయక్‌గారైతే నన్ను ఇంటికి పిలిచి. నా యాక్టింగ్‌ను అభినందించారు. నాకు అల్లు అర్జున్ డాన్స్‌లు, నటన అంటే చాలా ఇష్టం. ‘రేసుగుర్రం’ సెట్‌లోనే అల్లు అర్జున్ గారిని కలిశాను. బ్రహ్మానందం గారే నన్ను ఆయనకు పరిచయం చేశారు. నాన్నగారు నిర్మాత అయినప్పటికీ నాకు నిర్మాణ రంగం మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే.