గ్లామర్ పెరిగిన సభాపర్వం | Hema Malini, Paresh Rawal, Kirron Kher: Star politicians who stole the show this election season | Sakshi
Sakshi News home page

గ్లామర్ పెరిగిన సభాపర్వం

Published Sat, May 17 2014 11:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

గ్లామర్ పెరిగిన సభాపర్వం - Sakshi

గ్లామర్ పెరిగిన సభాపర్వం

సినీ తారలకూ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉన్న దేశం మనది. తాజా సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ సంగతిని మరోసారి స్పష్టం చేశాయి. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ దాకా, ఉత్తరాన పంజాబ్, ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణాన కేరళ దాకా అనేక రాష్ట్రాల్లో సినీ తారలు బాక్సాఫీస్ దగ్గర కాక, బ్యాలెట్ పెట్టెల వద్ద పోటీ పడ్డారు. లోక్‌సభతో పాటు మన రాష్ర్ట శాసనసభ బరిలోనూ తారలు సందడి చేశారు. మనవాళ్ళ సంగతి కాస్త పక్కనపెట్టి, ఇతర రాష్ట్రాల సంగతి గమనిస్తే, ఈ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద హిట్టయినవాళ్ళూ, ఫ్లాపైనవాళ్ళూ చాలామందే!

సినీతారలుగా సుప్రసిద్ధులైన హేమమాలిని, మున్ మున్ సేన్, కిరణ్ ఖేర్, పరేశ్ రావల్, మలయాళ నటుడు ఇన్నోసెంట్ లాంటి వారు ఎన్నికలలో గెలిచి, పార్లమెంట్ సభ్యులయ్యారు. అదే సమయంలో జయప్రద, నగ్మా, గుల్‌పనగ్, నటుడు రాజ్‌బబ్బర్, అమేథీలో రాహుల్ గాంధీతో పోటీపడ్డ నటి స్మృతీ ఇరానీ తదితరులు ఈ ఎన్నికల పోరులో మట్టికరిచారు. హిందీ చిత్రసీమలో ‘డ్రీమ్‌గర్ల్’గా పేరొందిన రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మథుర లోక్‌సభా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీచేశారు. యు.పి.లో వీచిన మోడీ ప్రభంజనంలో ఆమె అక్కడ ఇటీవలి వరకు లోక్‌సభ సభ్యులైన రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించారు. ప్రముఖ సినీ, రంగస్థల నటి కిరణ్ ఖేర్ ఎన్నికల యుద్ధంలోకి దిగిన తొలిసారే విజయ ఢంకా మోగించారు. నటుడు అనుపమ్‌ఖేర్ సతీమణి అయిన ఆమె పంజాబ్‌లోని చండీగఢ్ నుంచి బి.జె.పి. పక్షాన పోటీ చేసి, రైల్వేశాఖ మాజీ మంత్రి అయిన పవన్ కుమార్ బన్సల్‌ను భారీ తేడాతో ఓడించడం విశేషం.

అదే స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగిన నటి గుల్ పనగ్ మూడో స్థానంలో నిలిచారు. నటీమణులే కాక, నటులు కూడా ఈసారి లోక్‌సభకు బాగానే సినీ గ్లామర్ తెస్తున్నారు. ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పరేశ్ రావల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ తూర్పు స్థానంలో బరిలోకి దిగి, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించారు. చాలా కాలంగా బి.జె.పి.ని నమ్ముకున్న నటుడు వినోద్ ఖన్నా గడచిన 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఈసారి గురుదాస్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. ఇక, మరో సీనియర్ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా పాట్నా సాహిబ్ స్థానం నుంచి నాలుగోసారి గెలిచారు. బి.జె.పి. పక్షాన బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రాంతీయ భాషా నటుడు కునాల్ సింగ్‌తో ఢీ కొనడం విశేషం. ఈ ఇద్దరు నటుల పోరులో, సహజంగానే సీనియర్ అయిన శత్రుఘ్న సిన్హా గెలిచారు.

ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శనల్లో తన హాస్య విన్యాసాల ద్వారా ఆకట్టుకొనే పాపులర్ కమెడియన్ భగవంత్ మాన్... పంజాబ్‌లోని సంగ్రూర్ నుంచి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి అయిన శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాను ఓడించారు. సుప్రసిద్ధ భోజ్‌పురీ గాయకుడు - నటుడు మనోజ్ తివారీ బి.జె.పి. పక్షాన నిలిచి, ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి గెలిచారు. బాలీవుడ్ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్ నుంచి గెలిస్తే, తెలుగు వారికీ సుపరిచితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి బి.జె.పి. తరఫున దిగినా విజయం వరించలేదు. అదే రాష్ట్రంలోని శ్రీరామ్‌పూర్ నుంచి రేసులో మూడో ప్లేసుకే ఆయన పరిమితమయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈసారి సినీ తారల ఎన్ని కల సందడి ఎక్కువగా ఉంది. బంకురా నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ప్రముఖ నటి మున్ మున్ సేన్ (తెలుగులో కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ చిత్రంలో నటించారు) అక్కడ తలలు పండిన రాజకీయవేత్తను ఢీకొని, గెలవడం విశేషం. బీర్‌భూమ్ నుంచి శతాబ్ది రాయ్, మిడ్నాపూర్ నుంచి సంధ్యా రాయ్, కృష్ణానగర్ నుంచి తపస్ పాల్, ఘటల్ నుంచి దేవ్‌గా ప్రాచుర్యం పొందిన దీపక్ అధికారి విజేతలుగా నిలిచారు. ఈసారి కేరళలోని చేలక్కుడి స్థానం నుంచి ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, గెలిచారు. క్యాన్సర్‌తో బాధపడుతూ, ఇటీవలే కోలుకున్న ఆయన విజయం సాధించారు. రాజకీయ దిగ్గజాలను ఢీ కొనేందుకు సినీ గ్లామర్‌ను వాడుకొనేందుకు ఈసారి దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ప్రయత్నించాయి. అయితే, అన్నిచోట్లా అది పనిచేయలేదు.

లక్నో స్థానంలో బి.జె.పి. జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో ‘ఆప్’ పక్షాన నటుడు జావేద్ జాఫ్రీ పోటీ పడినప్పటికీ, రాజకీయ చైతన్యం ముందు సినిమా ఇమేజ్ పని చేయలేదు. ఇక, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన అమేథీ స్థానంలో బి.జె.పి. పక్షాన పోటీపడిన టి.వి. నటి స్మృతీ ఇరానీ ఆఖరుకు ఓటమి పాలైనా, మొదట్లో మంచి పోటీ ఇచ్చి, వార్తల్లో నిలిచారు. ఓటములూ ఎక్కువే! ఓటర్ల రాజకీయ చైతన్యం ముందు కొందరు సుప్రసిద్ధ తారల ఆకర్షణ మంత్రం పప్పులుడకలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన హిందీ నటుడు రాజ్ బబ్బర్ (ఘాజియాబాద్ స్థానం), ఇటీవల అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్‌గా పాపులరైన భోజ్‌పురి సూపర్‌స్టార్ రవి కిషన్ (ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి డివిజన్‌కు చెందిన జౌన్‌పూర్ స్థానం), తెలుగులోనూ పేరున్న హిందీ నటి నగ్మా (మీరట్ స్థానం) కౌంటింగ్ కేంద్రాల్లో చతికిలబడ్డారు.

చిత్రం ఏమిటంటే, భోజ్‌పురీ చిత్రాలకు అపర అమితాబ్ బచ్చన్‌గా పేరున్న రవి కిషన్ అయిదో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. నగ్మా నాలుగో స్థానానికీ నెట్టివేయబడ్డారు. కర్నాటకలోని మండ్యా నుంచి జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన యువ కన్నడ నటి రమ్య తాజా ఎన్నికల్లో తన స్టార్ ఎట్రాక్షన్‌ను చూపించలేకపోయారు. ఈ సారి ఓటమి పాలైన వారిలో ‘ఆరక్షణ్’, ‘సత్యాగ్రహ్’ లాంటి తాజా రాజకీయ చైతన్య చిత్రాల దర్శకుడైన ప్రకాశ్ ఝా (బీహార్‌లోని పశ్చిమ చంపారణ్), మరో దర్శక - నటుడు మహేశ్ మంజ్రేకర్ (ముంబయ్ వాయవ్యం), రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరిట బరిలోకి దిగిన నటి రాఖీ సావంత్, కొన్నేళ్ళుగా ఉత్తరాదిన రాజకీయాలకు గ్లామర్ పెంచిన తెలుగు నటి జయప్రద (ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నౌర్) ఉన్నారు. ఏమైనా, ఈ సారి మునుపటి కన్నా ఎక్కువ గ్లామరే ఎన్నికలకు వచ్చింది. విజేతలతో అది తాజా లోక్‌సభకూ విస్తరించనుంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement