
టూలెట్ చిత్రంలో ఓ దృశ్యం
సినిమా: రెండు సార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న హిరానీ దర్శకుడినే అబ్బురపరచిన తమిళ చిత్రం టూలెట్. అంతే కాదు 100 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన చిత్రం టూలెట్. ఇప్పటికే జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడనుంది. ఇప్పుడు గనుక దర్శకుడు బాలుమహేంద్ర జీవించి ఉంటే చాలా సంతోషపడి ఉండేవారని టూలెట్ చిత్ర దర్శకుడు సెళియన్ అన్నారు. ఛాయాగ్రహకుడైన ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం టూలెట్. ఇంతగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలను పొందుతున్న టూలెట్ చిత్రం దర్శకుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గత కొన్నేళ్ల క్రితం వికడన్ పత్రికలో అంతర్జాతీయ స్థాయి ఆసక్తిని రేకెత్తించిన చిత్రాల గురించి ఆర్టికల్ రాశానన్నారు. దీంతో తనకు అలాంటి చిత్రం చేయాలనిపించిందన్నారు.
అలా మనం చూస్తున్న అద్దె ఇళ్ల నివాసుల ఇతి వృత్తాన్ని, వారి కష్టాలను సహజత్వంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం టూలెట్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని రెండు ఆస్కార్ అవార్డులను గెలుసుకున్న ఇరానీ దర్శకుడు ఆస్ఘార్ పర్హాది చూసి చిత్రం చూసిన భావనే లేదని, ఒక వ్యక్తి జీవితాన్ని పక్కనుంచి చూసినట్లు ఉందని ప్రశంసించారన్నారు. హిరానీ చిత్రాలను ఆహా, ఓహో అని పొగడ్తల్లో ముంచెత్తడం చూసిన దర్శకుడు బాలు మహేంద్ర అలా ఇరానీయులు మన చిత్రాలను ప్రశంసించే రోజులు ఎప్పుడు వస్తాయోనని అనేవారన్నారు. ఆయన ఇప్పుడు జీవించి ఉంటే చాలా సంతోషించేవారని అన్నారు. కాగా టూలెట్ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మూడు కేటగిరీలో అవార్డుల కోసం పోటీ పడుతోందని చెప్పారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తొలి ఇండియన్ చిత్రం ఇదే అవుతుందన్నారు. అవార్డు వివరాలను ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తారని చెప్పారు. కాగా వందకు పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన టూలెట్ చిత్రాన్ని డిసెంబరులో లేదా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సెళియన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment