ఆమె... ఓ మోహం!
‘మోహిని’ అంటే మనసును మత్తులో ముంచేసే అందమని అర్థం. కథానాయిక త్రిష అందం కూడా అంతే. దాదాపు పధ్నాలుగేళ్లగా తన అందంతో, అభినయంతో వెండితెర మోహినిగా అభిమానులను మైమరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మోహిని’ అనే పాత్రతో మురిపించడమే కాదు.. భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారామె. పధ్నాలుగేళ్ల కెరీర్‌లో గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలకు కూడా ఓకే చెబుతూ వచ్చారు. ఈ మధ్య అయితే కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై మక్కువ చూపుతున్నట్లనిపిస్తోంది.
అది కూడా హారర్ చిత్రాలు చేయడం విశేషం. ‘కళావతి’ తర్వాత ఓ హారర్ చిత్రాన్ని పూర్తి చేశారు త్రిష. ఇప్పుడు ‘మోహిని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. మాధేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహిని పాత్ర కోసం త్రిష ప్రత్యేకంగా ప్రోస్థటిక్ మేకప్ కూడా వేసుకోనున్నారట. ఈ చిత్రం షూటింగ్ మొత్తం యూకే, మెక్సికోల్లో జరుగుతుంది. మోహిని అనే అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారట.