విజయామూర్తి
అరవై ఏడేళ్ల వయసులో ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిజానికి మలుపు తీసుకున్నది ఆమె జీవితం కాదు. ఆమే.. తనంతట తానుగా తన జీవితానికి కొత్త టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పటి వరకు గృహిణిగా గరిట తిప్పడమే ఆమెకు తెలిసింది. ఆమె చేతి వంట రుచి చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తుంటే మురిసిపోవడమే ఆమెకు అందమైన అనుభవం. అలా.. వంట చేయడంలోని సంతోషాన్ని దశాబ్దాల పాటు ఆస్వాదించిన ఆమె.. ఇప్పుడు తన వంటల్ని అక్షరబద్ధం చేశారు. ‘అథెంటిక్ గోదావరి నాన్ వెజ్ రెసిపీస్’ అనే ఆ పుస్తకం నిన్న మహిళా దినోత్సవం రోజు విడుదలైంది. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో విజయ మాట్లాడారు.
‘‘టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చేతిలో ఉన్న పుస్తకాన్ని మించినది మరొకటి ఉండదు’’ అంటారు విజయామూర్తి. ‘‘నేను ఒక యూ ట్యూబ్ చానెల్ వాళ్ల కోసం వంటల వీడియోలు చేశాను. కానీ మా అబ్బాయి.. ‘పుస్తకమే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుస్తకం రాయకూడదా అమ్మా..’ అని అడిగాడు. అందుకే మా గోదావరి మాంసాహార వంటలను అక్షరబద్ధం చేశాను. ‘ఉమెన్స్ డే’ రోజు పుస్తకాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనతో గత డిసెంబర్‌లో నా ప్రయత్నం మొదలు పెట్టాను. నేను తెలుగులో రాసిన తర్వాత మా కోడలు ఇంగ్లిష్‌లోకి అనువదించింది. ఇందుకోసం ఫొటో గ్రాఫర్‌ను పెట్టించి మరీ ప్రతి వంటనూ ఫొటో తీశాం. ఈ తరం అమ్మాయిలకు కందిపప్పుకి, పెసరపప్పుకి తేడా తెలియడం లేదు. అందుకే వంటలో ఉపయోగించే దినుసులను కూడా ఫొటో తీయించాం. వీడియోలు 150 వంటలు చేశాను. కానీ పుస్తకంలో తొలి ప్రయత్నంగా యాభై వంటలను మాత్రమే రాశాను.
ఇదీ నేపథ్యం
మాది రాజమండ్రి. నా చిన్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్‌కి వచ్చేసింది. నాకు బీఎస్సీ పూర్తయిన తర్వాత పెళ్లయింది. అత్తగారిల్లు కాకినాడ. నాన్నగారు, మామగారు కూడా న్యాయమూర్తులే. మా వారికి నచ్చినట్లు వండడం కోసం ఆయనకు ఇష్టమైన వంటలను మా అత్తగారు, పిన్నత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా పుట్టింట్లో, అత్తగారింట్లో బంధువుల రాకపోకలు ఎక్కువ. ఇంటికి వచ్చిన అతిథులు నా వంటలను మెచ్చుకుంటూ ఉంటే... ఎక్కడ లేని సంతోషం కలిగేది. తర్వాత పిల్లల స్నేహితుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువలా వచ్చి పడేవి. అలా వండడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేసేదాన్ని. తనకు నలభై ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ మా అబ్బాయి నా వెంట తిరుగుతూ ‘‘అమ్మా ఏం వండుతున్నావు’’ అని అడుగుతాడు.
తినేటప్పుడు కూడా ‘‘అమ్మా! వచ్చే తరానికి ఈ వంటలు గుర్తుండవు. ఒక తరం గ్యాప్ వస్తే చాలు... ఆ తర్వాత పిల్లలు కూడా పూర్తిగా మర్చిపోతారు. ఏదో ఒకటి చేద్దాం’’ అనేవాడు. ‘‘రాయడానికి ప్రయత్నించు, రాయగలుగుతావు’’ అని కూడా చెప్పేవాడు. ఇంతగా చెప్తున్నాడు కదా... అని రాయడం మొదలు పెట్టాను. ఒక్కొక్క వంట తయారీని రాస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో మాటల్లో చెప్పలేను. అయితే నేను రాయడాన్ని ఇంతటితో ఆపాలనుకోవడం లేదు. ఈ పుస్తకం ఆవిష్కరణ పూర్తయింది. ఇక పచ్చళ్ల తయారీ, పొడుల తయారీ పుస్తకాలు రాస్తాను’’ అని చెప్పారు విజయామూర్తి. పుస్తక రచయిత అనే హోదా తనకు కొత్త ఉత్సాహాన్నిస్తోందన్నారు.
ఇద్దరూ నేర్చుకోవాలి‘‘
వినడానికి ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ... ఈ తరంలో చాలా జంటలు విడిపోవడానికి కారణం వంటే. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చి ఏదో ఒకటి వండుకోవడానికి ప్రయత్నిస్తారు. వంట సరిగ్గా రాకపోవడం వల్ల డైనింగ్ టేబుల్ దగ్గర చిరాకులు మొదలవుతాయి. ఆ చిరాకులు బంధాలను బలహీన పరిచే వరకు కూడా కొనసాగుతాయి. ఆహారం అనుబంధాలను పెంచుతుంది. ఈ తరం అబ్బాయిలు–అమ్మాయిలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వండడం కూడా ఇద్దరూ నేర్చుకోవాలి. వైవాహిక జీవితాలను అందంగా అల్లుకోవాలి’’ అన్నారామె.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: జి. అమర్
Comments
Please login to add a commentAdd a comment