ముంబై: ఈ దీపావళికి బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’, తాప్సి ‘శాండ్ కీ ఆంఖ్’, రాజ్‌కుమార్ రావు ‘మేడిన్ చైనా’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్ 4’, అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా ‘శాండ్ కీ ఆంఖ్’ బాక్సాఫీస్ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది. విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ చైనా’ తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. సీనియర్ నటులు పరాశ్ రావల్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment