
సాక్షి, ముంబై: దేశీ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ బుధవారం 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హృతిక్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనను విష్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని శుభాశీస్సులు అందించారు. అందరిలోనూ మాజీ భార్య సుసానె ఖాన్ తెలిపిన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకమని చెప్పాలి. తామిద్దరు కలిసి దిగిన ఓ అందమైన ఫొటోకు.. అంతకంటే అందమైన కామెంట్‌తో సుసానె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 'ఎప్పటికీ, ఎల్లప్పటికీ నా జీవితంలో ఆనందానివి (సన్‌షైన్) నువ్వే. హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్‌డే. నీ నవ్వు మరింత వెలుగనీ.. పరిమితుల్లేకుండా నువ్వు మరింతగా వెలుగును పంచు.. పవిత్రమైన హృదయమా' అంటూ సుసానె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
హృతిక్, సుసానె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరం డిసెంబర్ 20న వీరి పెళ్లి జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు డిసెంబర్ 2013లో విభేదాల కారణంగా వేరయ్యారు. 2014 నవంబర్‌లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిధాన్ ఉన్నారు. విడాకులు తీసుకున్నా.. పిల్లల కోసం తరచూ కలుస్తూ.. చక్కని స్నేహితులుగా ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment