
ముంబై : బాక్సాఫీస్ వద్ద వార్ జోరు కొనసాగుతూనే ఉంది. దుర్గా పూజ, దసరా సందర్భంగా భారీ వారాంతం కలిసిరావడంతో ఈ మూవీ వసూళ్లు దండిగానే రాబట్టింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యువ సంచలనం టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ మూవీ రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి సల్మాన్ ఖాన్ భారత్ లైఫ్‌టైమ్ బిజినెస్‌ను అధిగమించింది. అక్టోబర్ 2న విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజూ రూ 20 కోట్లుపైగా కలెక్ట్ చేస్తూ ఏడవ రోజు దసరా హాలిడేతో 2019లో మూడో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా వార్ నిలిచిందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
వరుస సెలవలు కలిసివచ్చిన తొలివారంలో వార్ మూవీ రూ. 208 కోట్లు రాబట్టిందని, తమిళ్, తెలుగు వెర్షన్‌లను కలుపుకుని దేశవ్యాప్తంగా రూ. 215 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. రూ. 200 కోట్ల వసూళ్లు దాటిన వార్ కలెక్షన్లు ఇంకా నిలకడగా ఉండటంతో ముందుముందు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment