చిత్ర పరిశ్రమ వైజాగ్ వెళ్లదనే అనుకుంటున్నాను
భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమాది పై చెయ్యే. ఏడాదికి పన్నెండువందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది తెలుగు సినిమా.
‘‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమాది పై చెయ్యే. ఏడాదికి పన్నెండువందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది తెలుగు సినిమా. రాష్ట్రం విడిపోయినా విడిపోయిక పోయినా తెలుగు సినిమాకి సంబంధం లేదు. పరిశ్రమలో అందరం ఐకమత్యంగానే ఉంటాం. ఈ విషయంలో మాకెలాంటి విబేధాలు లేవు’’ అన్నారు నట్టికుమార్. నేడు ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా శనివారం పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘బర్త్‌డే సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. రాష్ర్టంలో ఉన్న థియేటర్లలో పన్నెండువందల థియేటర్లు లీజుదారుల చేతుల్లో ఉన్నాయి. వారు వసూలు చేస్తున్న అద్దెకు నిర్మాతలు, పంపిణీదారులు మునిగిపోతున్నారు. అందుకే లీజుకి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నంలో ఉన్నాం.
రాష్ట్ర విభజన జరిగితే పరిశ్రమ వైజాగ్ వెళుతుందనుకుంటున్నారు. కానీ అది జరగదనే అనుకుంటున్నా. అయితే గతంలో వైజాగ్‌లోనూ చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎఫ్‌డీసీకి ప్రభుత్వం 350 ఎకరాలు కేటాయించింది. అప్పట్లో ధర అధికంగా ఉన్న కారణంగా నిర్మాతలెవరూ కొనుక్కోలేదు. ఇప్పుడు వైజాగ్‌లో ఆ స్థలాల కేటాయింపు జరుగుతోందని తెలిసి, హైదరాబాద్‌లో స్థలాలున్నవాళ్లూ కొనుక్కోవాలనుకుంటున్నారు.
అయితే ఇక్కడ స్థలాలు లేని, ్రపస్తుతం రన్నింగ్‌లో ఉన్న నిర్మాతలకు కేటాయించాలని మనవి చేసుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిస్తున్న ‘యుద్ధం’ సినిమా గురించి చెబుతూ -‘‘చిత్ర నాయకా నాయికల మధ్య ఏర్పడిన ఇగో సమస్య వల్ల ఈ చిత్రం ఆలస్యం అయ్యింది. ఇప్పుడు రాజీ కుదరడంతో త్వరలో మూడు పాటల్ని పూర్తి చేసి, దసరాకు సినిమాని విడుదల చేస్తాం. అలాగే నూతన తారలతో కోటి రూపాయల్లోపు బడ్జెట్‌తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. మా అబ్బాయి క్రాంతి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తా’’ అన్నారు.