కాకాజీ లేక.. ఒంటరిగా అనిపిస్తోంది: డింపుల్ కపాడియా
ఒకప్పుడు భర్త నుంచి విడిపోయినా.. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన లేని లోటు తెలుస్తోందట. అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా ఈ మాట చెబుతోంది. రాజేష్ ఖన్నా మరణించి దాదాపు ఏడాది కావస్తుండగా ఆ లోటు డింపుల్ను బాగా బాధిస్తోంది. భారతీయ సినిమాలోనే మొట్టమొదటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా.. వరుసగా 15 హిట్లు కొట్టి రికార్డు సృష్టించగా ఆ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా ఇంతవరకు ఎవరూ వెళ్లలేకపోయారు.
1973లో డింపుల్ కపాడియా - రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నా, 1984లో విడిపోయారు. కానీ వాళ్లు విడాకులు మాత్రం తీసుకోలేదు. మళ్లీ రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లు కలిసే ఉన్నారు. ఆయనకు విపరీతమైన మానసిక బలం ఉందని, అసలు భయమంటే ఏంటో ఆయనకు తెలియదని డింపుల్ చెప్పింది. మరణిస్తానన్న విషయం ఆయనకు తెలిసినా కూడా చివరకు భయపడలేదంది. ఆయన ఎవరికీ భారంగా ఉండేవారు కారని.. శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎవరిమీదా ఆధారపడలేదని చెప్పింది.
పరిశ్రమలో అందరూ 'కాకాజీ' అని పిలుచుకునే రాజేష్ ఖన్నా.. తీవ్ర అనారోగ్యం పాలై, గత సంవత్సరం జూలై 18న మరణించారు. ఆరేళ్ల నుంచి తనకు కష్టాలు తప్పట్లేదని, తొలుత తన అక్క, తర్వాత అన్న, ఆపై కాకాజీ మరణించారని డింపుల్ అంది.
దీంతో ఇప్పుడు తనను పూర్తిగా ఒంటరితనం ఆవరించిందని ఆవేదన వ్యక్తంచేసింది. తన తల్లి ముగ్గురు బిడ్డలను కోల్పోగా తానొక్కదాన్నే మిగిలినట్లు చెప్పింది. అయినా ఆమె ఇప్పటికీ నిబ్బరంగా ఉందని, తాను మాత్రం ఇలా మిగిలిపోయానని వాపోయింది.