
ధోనీతో...డేటింగ్ చేసింది...నేనొక్కదాన్నేనా!
ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మి మధ్య అప్పట్లో ఏం జరిగింది? ముంబయ్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ధోనీ జీవితంపై తీసిన సినిమా ‘ఎం.ఎస్. ధోని- ద అన్‌టోల్డ్ స్టోరీ’లో రాయ్ లక్ష్మితో అతడి రిలేషన్‌షిప్ గురించి ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏంటంటే.. ‘చెన్నై సూపర్‌కింగ్స్’ ఐపీయల్ టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, రాయ్ లక్ష్మి ఆ టీమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు.
ధోనీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ప్రియాంక గురించి ‘ఎం.ఎస్. ధోని’ ప్రచార చిత్రాల్లో చూపించడంతో, తాజాగా మళ్ళీ రాయ్ లక్ష్మి ప్రస్తావన కూడా వస్తోంది. ‘అకిరా’లో రాయ్ లక్ష్మి అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. హిందీలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న ‘జూలీ2’ త్వరలో విడుదల కానుంది. అయితే, మీడియా మాత్రం రానున్న ఈ సినిమాల గురించి కాక గతాన్ని గుర్తు చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాయ్ లక్ష్మి చెప్పిన సంగతులు..
ధోనీ, నేనూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. ఏడాది కంటే తక్కువ రోజులే రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా ఇద్దరి అభిప్రాయాలూ కలవలేదు. దాంతో విడిపోయాం. ఎనిమిదేళ్ల క్రితమే ఆ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత అతడితో టచ్‌లో లేను. అయినా, ధోనీ నాతో మాత్రమే డేటింగ్ చేయలేదు. నా తర్వాత చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. చాలామందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ జాబితా చాలా పెద్దదే. ఆ సంగతులు ఎలా ఉన్నా, అతని జీవిత కథా చిత్రం అంటే అమ్మాయిలు, డేటింగ్ మాత్రమే కాదు కదా. ఈ సినిమాలో ధోనీ జీవిత ముఖ్య ఘట్టాలు చూపిస్తారనుకుంటున్నా.
అందులో నా ప్రస్తావన లేదనే అనుకుంటున్నా. ఒక క్రికెటర్‌తో సినిమా హీరోయిన్ డేటింగ్ కథ ఏంటో? తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. నావైపు నుంచి కథేంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ, నేనేమీ చెప్పలేదు. ఏ అమ్మాయీ మరొకరి మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవాలని కోరుకోదు.ఇప్పుడు ధోనీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఓ పాప కూడా పుట్టింది. అందుకే, ఇకపై ధోనీ గురించి అడిగితే, ‘క్రికెటర్‌గానే తెలుసు. వ్యక్తిగత పరిచయం లేదు’ అని చెబుతా.