సెక్షన్ 377పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా సెక్షన్ 377పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం తాను కూడా నేరస్తుడినేనని, తాను ఓరల్ సెక్స్ చేశానంటూ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల అంశంలో ఢిల్లీ కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో హన్సల్ మెహతా స్పందించారు. ఎల్జీబీటీ వర్గం ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటూ సాగిస్తున్న ఉద్యమానికి ఆయన తన మద్దతు తెలిపారు.
ఈ చట్టం కొనసాగితే తాను కూడా ఓ క్రిమినలే అని ... సెక్షన్ 377 రద్దు చేయాలని అభిప్రాయపడిన ఆయన ముఖరతి ఓరల్ సెక్స్కు పాల్పడిన తాను మాత్రమే కాకుండా..భారత్‌లో అత్యధికులు చట్టం దృష్టిలో నేరస్థులుగా మిగిలిపోతారన్నారు. ఈ చట్టం రద్దుకోసం పోరాడుతున్న నాజ్ ఫౌండేషన్ ను మెహతా అభినందించారు. అత్యధికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ 377ను రద్దు కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫౌండేషన్ చేస్తున్న పోరాటం ఫలించి ఆ దుర్మార్గపు చట్టం తొలగిపోవాలని ఆయన ఆశించారు.
2012లో షాహిద్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకొన్న హన్సల్ మెహత్ స్వలింగ సంపర్కం కథాంశంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ' అలీగఢ్' పేరుతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
కాగా ఐపీసీ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఈ మంగళవారం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీ వర్గాలు సంతోషంతో సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.