
ఆత్మహత్య చేసుకోవాలనున్నా: త్రివిక్రమ్ శ్రీనివాస్
'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ సీడీలు బయటకు రావడంతో ఆత్మహత్యే శరణ్యమనుకున్నామని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. తానెంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా దొంగదారిలో బయటకు రావడంతో ఆత్మహత్య ఒకటే మార్గమనుకున్నానని వెల్లడించాడు. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారని పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా విడుదలకు ముందే అక్రమ మార్గంలో బయటకు వస్తే చావు తప్ప మరో మార్గం ఉండదన్నారు. ఇప్పటికే సినిమా బయర్లకు అమ్మేసినప్పటికీ డబ్బులు ఇంకా చేతికి రాలేదని చెప్పారు.
'పైరసీ సీడీలు బయటకు వచ్చాయని తెలిసిన వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాం. వారు గొప్పగా స్పందించారు. 36 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ సమస్యను దశలవారిగా అధిగమించుకుంటూ వచ్చాం. క్షణక్షణం ఉత్కంఠకు గురయ్యాం. తర్వాత ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడింది. పవన్ కళ్యాణ్ అభిమానులు సీడీల పంపిణీని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అలాగే ఇంటర్నెట్ డౌన్లోడ్ లింకులను ఆపేశారు. ఆ మూడు రోజులు నరకం అనుభవించాను. అయితే సినిమా విడుదలయిన తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి కష్టాలన్నీ మర్చిపోయాను' అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పైరసీ వ్యవహారంతో నిర్మాతకు తాను, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారని వచ్చిన ఊహాగానాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించలేదు.