
దేశమాతకు... ముద్దుబిడ్డల నైవేద్యం
తెలుగు తెరపై దేశభక్తి జానర్‌లో చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో సినిమాలొచ్చాయి. చటుక్కున గుర్తుకు వచ్చే ఓ ఐదు సినిమాల ....
తెలుగు తెరపై దేశభక్తి జానర్‌లో చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో సినిమాలొచ్చాయి. చటుక్కున గుర్తుకు వచ్చే ఓ ఐదు సినిమాల గురించి సూక్ష్మంగా...
మన దేశం (1949)
భారత జాతీయోద్యమ కథాంశంతో వచ్చిన తొలి సినిమా ఇది. జానపదాలు, సాంఘికాలు రాజ్యమేలుతున్న సమయంలో ఇలాంటి సినిమా తీయడం నిజంగా రిస్కే. నిర్మాత, నటి కృష్ణవేణి మొండిగా నిర్మించారు. ఎన్టీఆర్ అభినయ గ్రంథంలో తొలి పేజీ ఈ సినిమానే. ఎల్వీ ప్రసాద్ డెరైక్ట్ చేశారు దీన్ని. ఇన్‌స్పైరింగ్ దేశభక్తి గీతాలున్నాయి ఇందులో. బ్రిటీష్ పరిపాలనా కాలంలో మనవాళ్లు పడ్డ అగచాట్లు వీటినన్నిటినీ కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు.
అల్లూరి సీతారామరాజు (1974)
తెలుగు జాతి పౌరుషాగ్ని అల్లూరి సీతారామరాజు. ఈ మన్నెం వీరుడి కథను తెరకెక్కించాలని హేమా హేమీలు అనుకున్నారు. ఆ అదృష్టం కృష్టకు దక్కింది. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా తీశారు. కృష్ణ కెరీర్‌లోనే కాకుండా, తెలుగు తెరపై ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. ‘తెలుగు వీర లేవరా...’ పాటకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ లాంటి వాళ్లంతా ఈ సినిమా వీరాభిమానులు.
సర్దార్ పాపారాయుడు (1980)
భరతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన ఒక దేశభక్తుడు... తీరా స్వతంత్ర భారతదేశం నల్లదొరల పీడనలో పడిపోయిందని గ్రహిస్తే? ఇప్పుడు మరో స్వాతంత్య్ర పోరాటం చేయడానికి సిద్ధపడితే? అటు స్వాతంత్య్ర పూర్వ వాతావరణాన్నీ, ఇటు సమకాలీన భారతీయ సమాజ పరిస్థితుల్నీ ఏకకాలంలో తెరపై చూపిన ప్రత్యేక చిత్రం - ‘సర్దార్ పాపారాయుడు’. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించింది.
రోజా (1992)
తీవ్రవాదులు కాశ్మీర్‌లో ఓ యువ భారత ఇంజనీర్‌ను కిడ్నాప్ చేస్తారు. ఎంత హింసించినా ఆ ఇంజ నీరు అణువ ణువునా దేశభక్తిని కనబరుస్తాడు. అతని భార్య, భర్త విడుదలకి సతీ సావిత్రిలా ఒంటరి పోరు చేస్తుంది. ఈ జనరేషన్‌లో దేశభక్తి నేపథ్యంలో ఇంత సినిమా రాలేదు. మణిరత్నందే ఆ క్రెడిట్.
భారతీయుడు (1996)
స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు. ఎన్నో కలలు కని సాధించుకున్న స్వతంత్ర భారతంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలడాన్ని ఆ సమరయోధుడు సహించలేకపోతాడు. తనకు తెలిసిన మర్మ కళతో ఆ చీడపురుగుల భరతం పడతాడు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్, శంకర్ టేకింగ్ ఓ వండర్.
పాడవోయి భారతీయుడా!
►లెండు భారతీయులారా నిదుర లేవండోయ్... - గృహలక్ష్మి (1938)
►పాడవోయి భారతీయుడా... - వెలుగు నీడలు (1967)
►నా జన్మభూమి ఎంతో అందమైన దేశము... - సిపాయి చిన్నయ్య (1969)
►నీ ధర్మం... నీ సంఘం... నీ దేశం నువ్వు మరవొద్దు ...
►కోడలు దిద్దిన కాపురం (1970)
►గాంధీ పుట్టిన దేశమా ఇది... - పవిత్ర బంధం (1971)
►భారతమాతకు జేజేలు... - బడిపంతులు (1972)
►గాంధీ పుట్టిన దేశం... - గాంధీ పుట్టిన దేశం (1973)
►తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. - అల్లూరి సీతారామరాజు (1974)
►మన జన్మభూమీ బంగారుభూమి... - పాడిపంటలు (1976)
►ఎక్కడికెళుతుంది? దేశం ఏమైపోతుంది... - బంగారు మనిషి (1976)
► జననీ... జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి... - బొబ్బిలిపులి (1982)
►జయ జయ జయ ప్రియభారత... - రాక్షసుడు (1986)
►ఏ దేశమేగినా... - అమెరికా అబ్బాయి (1987)