లావణ్యా త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వీవీ వినాయక్, సి. కల్యాణ్
‘‘మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. సి.కల్యాణ్‌గారి సంస్థలో ఓ సినిమా చేయమని. ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో మా నాన్నగారి కోరిక నెరవేరింది. కల్యాణ్‌గారు నిర్మాతలా కాకుండా మా అన్నయ్యలాగా అనిపించారు. సెట్లో ఇద్దరు అన్నదమ్ములం ఉన్నట్టు అనిపించింది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘కృష్ణ’ సినిమాలాగా ఈ చిత్రంలోనూ అన్ని అంశాలుంటాయి. తేజ్ బాగా చేశాడు. తను ఎంత ఎదిగినా అన్నయ్యలాగా(చిరంజీవి) ఇలాగే ఉండాలి. ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘చమక్కు చమక్కు’ పాటను రీమిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమా ఏ చిత్రానికీ పోటీ కాదు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. సినిమా చూశా. చాలా బాగా నచ్చింది’’ అన్నారు సి.కల్యాణ్.
‘‘మావయ్యతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా తర్వాత వినాయక్‌గారు నాతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. డబ్బింగ్‌లో కొన్ని సీన్లు చూసి ఇవి చేసింది నేనేనా? అని షాక్ అయ్యాను. మా సినిమాతో పాటు వస్తున్న వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా కూడా హిట్ కావాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. లావణ్యా త్రిపాఠి, నటుడు సప్తగిరి, కథ, మాటల రచయిత శివ ఆకుల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: తమన్, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా.
Comments
Please login to add a commentAdd a comment