లావణ్య త్రిపాఠి
‘‘ఒక్కో డైరెక్టర్ టేకింగ్ ఒక్కో విధంగా ఉంటుంది. ‘ఇంటిలిజెంట్’ విషయానికొస్తే వినాయక్‌గారి టేకింగ్ భిన్నంగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి ఎక్కువ నటనకు స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య చెప్పిన విశేషాలు...
►‘ఇంటిలిజెంట్’లో నా పాత్ర పేరు సంధ్య. అమెరికాలో చదువుకుని, ఇండియా వచ్చి తండ్రికి బిజినెస్‌లో సహాయం చేస్తుంటా. సంధ్య కొంచెం కోపిష్టి. రియల్ లైఫ్‌లో నేనలా కాదు. హీరో తన ఇంటెలిజెన్స్‌తో విలన్లని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ. అందుకే సినిమాకి ఆ టైటిల్ పెట్టారు.
►తేజ్ (సాయిధరమ్ తేజ్) ఎప్పుడూ ఫన్నీగా ఉంటాడు. మంచి డ్యాన్సర్. నేను పని చేసిన హీరోల్లో తేజ్ చాలా కంఫర్ట్. నా గత సినిమాల కంటే ఈ చిత్రంలో ఎక్కువ డ్యాన్సులు చేశా. అందుకోసం బాగా ప్రాక్టీస్ చేశా.
►వినాయక్‌గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు కావాల్సింది మా చేత సులభంగా రాబట్టుకున్నారు. మమ్మల్నందర్నీ చిన్న పిల్లల్లా చూసుకున్నారు. కల్యాణ్‌గారికి సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సెట్స్‌లోనే ఉంటూ షూటింగ్‌ను ఎంజాయ్ చేసేవారు.
►చిరంజీవిగారి ‘చమకు చమకు..’ పాట రీమిక్స్ అనగానే కొంత టెన్షన్ పడ్డా. చిరంజీవిగారు చేసిన ఆ సాంగ్ రీమేక్ అంటే టెన్షన్ ఉంటుంది కదా. నేను ఆయన అభిమానిని. చిరంజీవిగారు, విజయశాంతిగారి స్థాయిలో చేయడం సాధ్యం కాదు. ప్రేక్షకులకు నచ్చేలా చేయడానికి మా ప్రయత్నం చేశాం.
►భిన్నమైన కథలను ఎంచుకునే వీలు హీరోయిన్లకు తక్కువ. ఆ విషయంలో హీరోలకు మంచి అడ్వాంటేజ్. కథానాయికలకు కూడా భిన్నమైన కథలు ఎంచుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నా. నా మటుకు నేను వచ్చిన కథల్లో నటిగా నాకు మంచి పేరు తెచ్చేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను.
►నేను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నాననే వార్తలు వచ్చాయి. అన్ని వార్తల్లోనూ నిజం ఉండకపోవచ్చు. నాకు కొందరితో విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. అది కూడా నిజం కాదు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment