20 కోట్లు తగ్గించారు!
విడుదలకు ముందే హిందీలో సెంచరీ చేసేయాలని రజనీకాంత్ ‘2.0’ నిర్మాతలు (లైకా ప్రొడక్షన్స్ సంస్థ) చాలా ఆశపడ్డారు! కానీ, డక్‌వర్త్ లూయిస్ సిస్టమ్ ప్రకారం మీ సినిమాకు సెంచరీ కష్టమంటూ నిర్మాతల ఆశలపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నీళ్లు చల్లారట. దాంతో సెంచరీకు 20 తక్కువతోనే సరి పెట్టుకోవల్సి వచ్చిందట! అసలు మేటర్ ఏంటంటే... రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న టెక్నో థ్రిల్లర్ ‘2.0’.
‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 100 కోట్లకు రూపాయి తక్కువ అయితే ఇచ్చేది లేదంటూ నిర్మాతలు కూర్చున్నారట! ‘రోబో’ హిందీ వెర్షన్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? రూ.18 నుంచి 20 కోట్ల మధ్య. అలాంటప్పుడు సీక్వెల్‌కు 100 కోట్లు ఎలా ఇస్తారనే డౌట్ రావొచ్చు. ఇందులో హిందీ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు కదా.
పైగా, ‘బాహుబలి’తో హిందీలో డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిందనే విషయాన్ని గుర్తు చేశారట! రేటు విషయమై నిర్మాణ సంస్థకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పలుమార్లు డిస్కషన్స్ జరిగాయి. చివరకు, ‘2.0’ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ డీల్ 80 కోట్లకు కుదిరిందట! ఇప్పటికి 80తో సరిపెట్టుకున్నా... విడుదల తర్వాత ‘2.0’ సెంచరీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో అమీ జాక్సన్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.