ఐ లవ్ యు చెప్పలేదు!
బుల్లితెర ప్రేక్షకులకు రేష్మీ గౌతమ్ సుపరిచితురాలే. అడపాదడపా సినిమాలు కూడా చేస్తూ, తన ప్రతిభ నిరూపించుకుంటున్నారామె. తెలుగులో చకాచకా మాట్లాడే రేష్మి ఒరిస్సా అమ్మాయి. యాంకర్‌గా రాణించాలని పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆమె నటించిన ‘గుంటూరు టాకీస్’ మార్చి 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రేష్మి చెప్పిన ముచ్చట్లు...
♦ ‘ప్రస్థానం’లో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత అదే తరహా పాత్రలే రావడంతో, అంగీకరించలేదు. నటిగా నాకు నేను మహరాణి అని నా ఫీలింగ్. ఏ పాత్ర పడితే అది చేసి, నాలోని మహరాణిని తగ్గించుకోలేను. ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’కి అడిగినప్పుడు హ్యాపీగా ఒప్పుకున్నాను. ఎందుకంటే దర్శకుడిగా ఆయన స్టామినా ఏమిటో నాకు తెలుసు. ఈ చిత్రంలో నేను పొగరుబోతు పల్లెటూరి అమ్మాయిగా నటించాను. తక్కువ మేకప్, ఎక్కువ నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇది.
♦ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా నటించాను. పరిచయం లేని వ్యక్తులతో అలాంటి పాట చేయడం కష్టం. అందుకే, ఈ పాటను చివర్లో తీశారు. ఈలోపు నేను, హీరో సిద్ధు ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ రొమాంటిక్ సాంగ్ బాగా రావడానికి కారణం అదే. నాకు ఇలాంటి పాటలు చేయడానికి అభ్యంతరం లేదు. నా తదుపరి చిత్రం ‘తను వచ్చెనంట’. అందులోనూ మంచి పాత్ర చేస్తున్నా.
♦ చిన్నితెర తారలంటే చిన్నచూపు లేదని నా ఉద్దేశం. నిహారిక (నటుడు నాగబాబు కుమార్తె) సినిమా చేస్తోంది. అనసూయ కూడా సినిమాలు చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
ప్రేమ, పెళ్లి గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు.
♦ నేను కొంచెం టామ్‌బాయ్ టైప్. అందుకే ‘ఐ లవ్ యు’ చెప్పడానికి అబ్బాయిలు సాహసించరు. నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు. తమిళ హీరో సూర్య అంటే ఇష్టం. వేరే ఎవరి మీదా క్రష్ లాంటివి ఏవీ లేవు.