Guntur Talkies
-
గుంటూరులో రష్మీ సందడి
ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు): జబర్ధస్త్ యాంకర్, హీరోయిన్ రష్మీ ఆదివారం గుంటూరులో సందడి చేశారు. పట్టాభిపురం ప్రధాన కూడలిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రీట్రెండ్స్ సెలూన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రష్మీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందానికి తగిన ప్రాధాన్యమివ్వడం మంచి పరిణామమన్నారు. జబర్ధస్త్ షోతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. మంచి పాత్రలుదొరికితే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేవీన్‌కేర్ గ్రీన్‌ట్రెండ్స్ పట్టాభిపురం ఫ్రాంచేజీ అధినేత సైనిక నేతాజీ పాల్గొన్నారు. -
వెబ్ సిరీస్‌లో మరో యంగ్ హీరో
ప్రవీణ్‌సత్తారు డైరెక్షన్లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన సీనియర్ నరేశ్, సిద్ధు జొన్నలగడ్డల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందినిరెడ్డి అందించిన కథతో ‘దడ’ డైరెక్టర్ అజయ్ భుయాన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ కథను ముందుగా పూర్తి స్థాయి సినిమాగా తీయాలనుకున్నా...నిడివి ఎక్కువ అవుతుందని వెబ్ సిరీస్ ఆలోచన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు సెలబ్రెటీలకు మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడనీ, సిరీస్ మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందనీ, పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, హరితేజ (బిగ్‌బాస్ ఫేం) నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో దర్శకుడిగా సక్సెస్ సాధిస్తానని అజయ్ భుయాన్ నమ్మకంగా ఉన్నాడు. -
జోరు.. హుషారు...
పులిపిల్ల మంచి జోరు మీదుందండీ! పులిపిల్ల అంటే ఎవరో అనుకునేరు. నికిషా పటేల్ . ‘కొమరం పులి’తో ఈ ఎన్నారై భామ హీరోయిన్గా పరిచయమై అప్పుడే ఆరేళ్లయింది. ‘కొమరం పులి’ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసినా... ఇప్పటికీ నికిషా పటేల్‌ని పులి పిల్లగానే ప్రేక్షకులు గుర్తు పడుతున్నారు. ఇప్పటికీ ఆమెను వెతుక్కుంటూ మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ‘గుంటూర్ టాకీస్–2’ సినిమా అంగీకరించిన ఈ భామ, తాజాగా తెలుగు–తమిళ బైలింగ్వల్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘జర్నీ’ ఫేమ్ జై హీరోగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. హర్షిమ్ మారేకర్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నికిషా పటేల్ క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుందట! ఈ రెండూ కాకుండా మలయాళ హిట్ సినిమా ‘100 డిగ్రీ సెల్సియస్’ తెలుగు, తమిళ రీమేక్‌లో నికిషా కీలక పాత్రలో నటిస్తున్నారు. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర కీలక పాత్రధారులు. ఇంకో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట! ఈ ఏడాది కెరీర్ జోరుగా సాగుతుందనే నమ్మకాన్ని నికిషా వ్యక్తం చేశారు. -
గుంటూరులో..?
‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..’ అంటూ ‘సింహా’ చిత్రంలో తన గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టారు బొద్దుగుమ్మ నమిత. ఆ చిత్రం విడుదలై ఆరేళ్లు దాటినా ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఆ మాటకొస్తే తమిళంలో కూడా చేయడంలేదు. సహజంగానే బొద్దుగా ఉండే నమిత మరింత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గాయనొచ్చు. ఆ విషయం గహ్రించారేమో స్లిమ్ అయ్యారు. తమిళంలో ఆల్రెడీ ఓ సినిమా అంగీకరించారు. తాజాగా ‘గుంటూర్ టాకీస్ 2’తో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ–ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఆ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ దర్శకునిగా మారి, ‘గుంటూర్ టాకీస్ 2’ తెరకెక్కించ నున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తీయాలను కుంటున్నారట. ఇందులో డాన్ పాత్రకు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లీయోన్ను తీసుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఓ ముఖ్య పాత్రలో నమిత కనిపించనున్నారని టాక్. దర్శక–నిర్మాత ఆమెను సంప్రదించారట. ఇక, నమిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
తెలుగు డాన్... సన్నీలియోన్
శృంగారతార సన్నీలియోన్ తెలుగు తెరపై డాన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఆర్కె స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూర్ టాకీస్-2’ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక-నిర్మాత మాట్లాడుతూ-‘‘మా బ్యానర్లో ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించనున్నాం. ‘రాజా.. మీరు కేక’ నవంబర్‌లో విడుదల చేస్తాం. ‘గుంటూర్ టాకీస్’లో కుటుంబ ప్రేక్షకులను మిస్ అయ్యామని అన్నారు. ఇప్పుడీ సీక్వెల్‌ని ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యేలా రూపొందిస్తున్నాం. ఇందులో సన్నీలియోన్‌తో పాటు తమిళం నుంచి ప్రముఖ హీరోయిన్ నటిస్తారు. దక్షిణాదిలో సన్నీ ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చిలో రిలీజ్’’ అని పేర్కొన్నారు. నటులు సీనియర్ నరేశ్, వినీత్, హీరోయిన్ అదితీసింగ్, రచయిత కిరణ్ పాల్గొన్నారు. -
కథే హీరో
హీరో ఇంట్రడక్షన్ ఫైట్... ఆ వెంటనే సాంగ్... హీరోయిన్‌తో లవ్ ట్రాక్... విలన్‌తో ఫైట్ ట్రాక్... హీరో, విలన్లు మాటామాటా విసురుకుంటే, ఇంటర్వెల్ బ్యాంగ్... కాసింత కథ... చివరలో మళ్ళీ ఐటమ్ సాంగ్... ఆపైన క్లైమాక్స్ ఫైట్... తెలుగు సినిమా కథను... ఎప్పుడో కంచికి చేర్చేసిన ‘ఆరు పాటలు, మూడు ఫైట్ల’ మూస ఫార్ములా ఇది. మరి, ఈ మూసను బద్దలుకొట్టేదెవరు? ఎప్పుడు? ‘ఎప్పుడో కాదు... ఇప్పుడే’ అంటున్నాయి కొన్ని కొత్త సినిమాలు. హీరో ఎవరన్నది కాదన్నయ్యా... కథ, కథనం కొత్తగా ఉన్నాయా, లేవా అన్నది ఇప్పుడు పాయింట్. లెటజ్ వెల్కమ్ న్యూ ఏజ్ తెలుగు సిన్మా. ‘‘మా దర్శక, రచయితల్లో వచ్చినంత వేగవంతమైన మార్పు నిర్మాతల్లో కనిపించడం లేదు. ఒక్క ఎదురుదెబ్బ తగిలినా, ఒక్క మాస్ సినిమా హిట్టయినా - మళ్ళీ అందరూ రొటీన్ బాక్సాఫీస్ ఫార్ములా వెంటే వెళ్ళిపోతున్నారు. అందుకే, ఇప్పుడు న్యూ ఏజ్ డెరైక్టర్స్, రైటర్స్ లాగానే న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన టైమ్ వచ్చేసింది. వాళ్ళు ఎంతమంది వస్తే, అంత త్వరగా తెలుగు సినిమా - కథే హీరోగా కొత్త తీరాలకు వెళుతుంది’’ - ‘గుంటూరు టాకీస్’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు జూలై 29... సమ్మర్ సీజన్ అయిపోయాక సినిమా హాళ్ళు కొద్దిగా పల్చబడిన టైమ్... ‘పెళ్ళిచూపులు’... చిన్న సినిమా. చిన్న స్థాయిలోనే రిలీజైంది. హీరో విజయ్ దేవరకొండ... ‘ఎవడే సుబ్రమణ్యం’లో హీరో నాని ఫ్రెండ్ పాత్ర మినహా పెద్దగా తెలిసిన ముఖమేమీ కాదు. హీరోయిన్ రితూ వర్మ ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పిల్ల. దర్శకుడు? తరుణ్ భాస్కర్... ఇదే ఫస్ట్ ఫిల్మ్. కానీ, రిజల్ట్ అందుకు పూర్తి భిన్నం. చిన్నస్థాయిలో రిలీజైనా, ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్! తరువాత కొద్ది రోజులకే వెంకటేశ్, సాయిధరమ్ తేజ్ లాంటి పేరున్న హీరోల సినిమాలు వచ్చినా, జనం చూపు ‘పెళ్ళిచూపులు’ దగ్గరే నిలిచిపోయింది. పేరున్న యాక్టర్లు, టెక్నీషియన్లు లేరన్న మాటే కానీ, ఒకరనుకొని మరొకరిని పొరపాటున పెళ్ళిచూపులు చూసుకున్న హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ ‘రొమాంటిక్ కామెడీ’ చిత్రం పెద్ద పెద్దవాళ్ళ సినిమాల కన్నా బాక్సాఫీస్ వద్ద భారీగా కాసులు తెచ్చింది. పెట్టిన ఖర్చుకీ, వచ్చిన రాబడికీ లెక్క చూస్తే - టాప్ హీరోలను తలదన్నేలా లాభాలూ నిర్మాతకు ఇచ్చింది. అవును. అందుకే... ఇప్పుడు టాప్ స్టార్స్ కాదు... కథే అసలు సిసలు హీరో! ఇవాళ - సినిమాలో టాప్ స్టార్స్ ఉన్నప్పటికీ, జనాదరణ ఎంత ఉంటుందనేది చెప్పలేం. అదే గనక - కథ కొత్తగా ఉంటే సూపర్! కథ బాక్సాఫీస్ ఫార్ములా ఫక్కీలో కాస్తంత పాతదే అయినా సరే, కథనం గనక ఆసక్తికరంగా ఉంటే... సూపర్ డూపర్! అలాంటి సినిమాలకు న్యూ ఏజ్ ఆడియన్స్ జై కొడుతున్నారు. గత ఏడాది విడుదలైన ‘భలే మంచి రోజు’, ‘గుంటూరు టాకీస్’ల నుంచి ఈ ఏటి ‘క్షణం’, లేటెస్ట్ ‘పెళ్ళిచూపులు’, ‘శ్రీరస్తు - శుభమస్తు’ దాకా అదే వరస! ఈ సినిమాలన్నీ జనం మెప్పూ పొందాయి... డబ్బులూ తెచ్చాయి. తెలుగు తెరపై... ఇప్పుడు వీస్తున్న గాలి! నటిస్తున్నప్పుడే డైలాగ్స్ కూడా రికార్డ్ చేసే ‘సింక్ సౌండ్’ విధానంతో, సినిమాలా కాకుండా జీవితాన్ని చూపిస్తున్నట్లు సాగిన నిజాయతీ నిండిన ప్రయత్నం ‘పెళ్ళి చూపులు’ రొమాంటిక్ కామెడీ జానర్‌కి కొత్త తరహా ఎక్స్టెన్షన్. ఇక, అల్లు శిరీష్ నటించిన లవ్‌స్టోరీ ‘శ్రీరస్తు - శుభమస్తు’ పెద్ద అంచనాలు లేకుండానే విడుదలైనా, మాస్ మెప్పు పొందింది. కథగా కన్నా, హాస్యం నిండిన కథనంతో ఆకర్షించింది. దశాబ్దిన్నర క్రితం ‘ఐతే’ రోజుల నుంచి అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ‘మనమంతా’తో మిగతావాళ్ళ కన్నా తన కథ, కథనం భిన్నమని మళ్ళీ నిరూపించారు. నిజానికి, కథనే నమ్ముకొని సినిమా తీయడం తెలుగు సినిమా ఒకప్పుడు అనుసరించిన పద్ధతే. ఆరు పాటలు, మూడు ఫైట్ల మూసలోకి జారిపోయాకనే కథ బదులు హీరో, మిగతా హంగులకు పెద్ద పీట పడింది. మధ్య మధ్యలో కొన్ని మెరుపులు మెరిసినా, గడచిన ఏడాది పై చిలుకుగా ‘భలే మంచి రోజు’, ‘రాజు గారి గది’, ‘గుంటూరు టాకీస్’, ‘క్షణం’ లాంటి కొత్త తరహా తెలుగు సినిమాలు తరచూ రావడం మొదలైంది. తమిళం, మలయాళమే కాదు... మనమూ! నిన్న మొన్నటి వరకు ఈ రకమైన కొత్త తరహా సినిమా అంటే, తమిళ, మలయాళ సినిమాలే కేరాఫ్ అడ్రస్ అన్నట్లు మాట్లాడేవాళ్ళం. కొత్త తరహా కథలు, లో-బడ్జెట్ ప్రయత్నాలు అక్కడే ఎక్కువ. కానీ, ‘యూ ట్యూబ్’ సంస్కృతి, టారెంట్ సైట్స్ పుణ్యమా అని ఆ సినిమాలన్నీ వెంటనే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆ కొత్త తరహా ప్రయత్నాలు చకచకా ఇక్కడి మనవాళ్ళకూ వెంటనే తెలిసొస్తున్నాయి. మరోపక్క డిజిటల్ టెక్నాలజీ, సినిమాల్లోకి వచ్చేందుకు వీసాగా తయారైన షార్ట్ ఫిల్మ్స్‌తో కొత్త తరం ఫిల్మ్‌మేకర్స్ ముందుకొస్తున్నారు. సినిమాను కేవలం నిజజీవితం నుంచి ఒక ఎస్కేపిస్ట్ రూట్‌గా కాకుండా, జీవితానుభవంలోని ఒక శకలానికి ప్రతిరూపంగా మార్చాలనే ధోరణికి కాస్తంత బలం వచ్చింది. ఇవన్నీ కలవడంతో - తమిళ, మలయాళాల అంత ఉద్ధృతంగా కాకపోయినా తెలుగు తెర మీదా ఇప్పుడు కొత్త గాలి వీయడం మొదలైంది. స్టోరీనే నమ్ముకొని దర్శక, నిర్మాతలు అడపాదడపానైనా ముందుకొస్తున్నారు. కొత్తదనం ఉంటే సరిపోతుందా? సినిమాల్లో, ప్రేక్షకుల్లో మార్పు వస్తోంది సరే! మరి, మార్పుకు బాసటగా నిలిచే ఈ కొత్త ప్రయత్నాలన్నీ బాక్సాఫీస్ హిట్లేనా? అలాగని గ్యారెంటీ ఏమీ లేదు! లేటెస్ట్గా ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘మనమంతా’ కూడా కొత్త తరహా ప్రయత్నమే! ప్రతి ఒక్కరూ సినిమా స్లోగా అనిపించినా, చివరి అరగంటా మరపురాని అనుభూతి అన్నారు. నాలుగు జీవితాల సమాహారంగా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆ నాలుగు కథలూ ఒకదానికొకటి ముడిపడేలా, రొటీన్‌కు భిన్నంగా సాగుతుందీ సినిమా. గౌతమి, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ లాంటి ప్రముఖులూ ఉన్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, కథన లోపాలు, పబ్లిసిటీ - మార్కెటింగ్ వ్యూహాల్లో అలసత్వం దెబ్బతీశాయి. కథలో కొత్తదనం ఎంత ఇంపార్టెంటో, జనసామాన్యం దగ్గరకు దాన్ని తీసుకువెళ్ళడం అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తు చేసింది. మారాల్సింది నిర్మాతలేనా? ఇలాంటి ఎదురుదెబ్బల్ని సహించి, మారుతున్న కాలానికీ, ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్లు ముందుకొచ్చే నిర్మాతలు ఇప్పటికే తక్కువే. ఇవాళ అందరూ గొప్పగా మెచ్చుకుంటున్న ‘పెళ్ళిచూపులు’ స్క్రిప్ట్ పట్టుకొని ఆ చిత్ర దర్శక- రచయిత తరుణ్ భాస్కర్ మూడేళ్ళు పలువురు నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చిందంటే నమ్ముతారా? ప్రవీణ్ సత్తారు కూడా అంతే. అయిదేళ్ళ క్రితం ‘ఎల్.బి.డబ్ల్యు’, తరువాత ‘చందమామ కథలు’ లాంటి కొత్త తరహా ప్రయత్నాలు చేసి, ఆర్థికంగా కన్నా హార్దిక ప్రశంసలే అందుకున్నారు. తరుణ్ కానీ, ప్రవీణ్ కానీ పట్టుదలగా ప్రయత్నాలైతే మానలేదు. చివరకు, సమాజంలోని ఇద్దరు సామాన్య దొంగల జీవితం చుట్టూ తిరిగే ‘గుంటూరు టాకీస్’తో ప్రవీణ్‌ను బాక్సాఫీస్ విజయం వరించింది. 2 కోట్ల లోపు బడ్జెట్‌తో తయారైన ఆ సినిమా కేవలం హాళ్ళలోనే రూ. 10 కోట్ల పైగా వసూలు చేసింది. ఆ ఊపుతో ప్రవీణ్ ఇప్పుడు మూడు విభిన్న తరహా కథలతో సినిమాలు తీయనుండడం విశేషం. తాజాగా రాజశేఖర్‌తో తీస్తున్న యాక్షన్ స్టోరీ, పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తీసే సినిమా, ఆ తరువాత తీసే లవ్‌స్టోరీ - మూడూ కూడా కథనే హీరోగా నడిపే కొత్త ప్రయత్నాలట. మరోపక్క ‘షార్ట్ ఫిల్మ్స్’ రూట్ నుంచి దర్శకుడైన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ అరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌తో సినిమా చేయడానికి పెద్ద హీరోలు రెడీ అవుతున్నారు. మతిమరుపున్న హీరో (‘భలే భలే మగాడివోయ్’లో నాని), వీల్ ఛెయిర్‌కే పరిమితమైన నాయకుడు (‘ఊపిరి’లో నాగ్) లాంటి కొత్త తరహా ప్రయత్నాలు క్రమంగా పెరుగుతున్నాయి. సమాజం లాగానే, ప్రతి పదేళ్ళకొకసారి తెలుగు సినిమా కూడా మారుతోందనడానికి ఇవన్నీ తాజా సూచనలు! మంచి సినిమా కోసం ఎదురుచూపులతో ఉన్నవారికి తీపి కబుర్లు! మనలో ఈ మార్పు ఎలా మొదలైంది? కొత్త శతాబ్ది ప్రేక్షకులు ఇప్పుడు కొత్త వర్గాలుగా తయారయ్యారు. వారం వారం వస్తున్న రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాల మధ్య కొత్త దనం కోరుకోవడం పెరిగింది. పట్టణ, గ్రామీణ వర్గాల అభిరుచుల తేడాలతో పాటు, మల్టీప్లెక్సులు పెరిగిపోతున్న వేళ - ‘మల్టీప్లెక్స్ కల్చర్, ఆడియన్స్’ అనే కొత్త వర్గీకరణ వచ్చి చేరింది. అలాగే, విదేశాల్లో హాలీవుడ్ చిత్రాలు అలవాటై, తెలుగు సినిమాల్లో కొత్తదనం కోరుకుంటున్న ప్రవాస భారతీయులు కూడా ‘ఓవర్సీస్ ఆడియన్స్’ అనే కొత్త వర్గం కింద విలక్షణంగా నిలిచారు. ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, కామెడీ లాంటి కొన్ని కోవల సినిమాలకు పర్మినెంట్ ఆడియన్స్‌గా మారారు. ఆ సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్‌కి పెట్టనికోట అయ్యారు. కొత్త తరహా కథలు, కథనాలతో సినిమా వస్తే చాలు... ఠక్కున అక్కున చేర్చుకుంటున్నారు. అటు ఓవర్సీస్ మార్కెట్, ఇటు మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోవడంతో పాటు ప్రధాన ఆదాయ వనరులయ్యాయి. అంతే! తెలుగు సినిమా కొత్త గెటప్ వేసుకొంది. ఆలస్యంగా, అతి నిదానంగా అయినా సరే మన సినిమా క్రమంగా మారడం మొదలైంది. -
పదేళ్లకో ట్రెండ్ సెట్టర్ వస్తుంది!
‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో ‘అ..ఆ’ చిత్రంలోని రామలింగం పాత్ర ది బెస్ట్. ‘గుంటూరు టాకీస్’లోని పాత్ర మాస్‌కి దగ్గర చేస్తే, రామలింగం క్యారెక్టర్ క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘ప్రతి పదేళ్లకోసారి ట్రెండ్ సెట్ చేసే మూవీ వస్తుంటుంది. ‘అ..ఆ’ అటువంటి కోవలోకి వస్తుంది. ప్రస్తుతం రావు రమేశ్, నేను ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇప్పటి తరం దర్శకులతో పనిచేయడం వల్ల ప్రస్తుత ట్రెండ్ తెలుస్తోంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్దదే. కృష్ణగారి స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’లో, మహేశ్‌తో ‘బ్రహ్మోత్సవం’లో చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు కమిట్ అయ్యా’’ అన్నారు. -
రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న సిద్దూ
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్‌లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు. చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. -
ఆయనతో డేటింగ్ చేస్తున్నాను
అవును ఆయనతో డేటింగ్ చేస్తున్నాను అని ధైర్యంగా వెల్లడించింది నటి రేష్మీగౌతమ్. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు ఆ తరువాత కనుమరుగైందనే చెప్పాలి. తెలుగులోనూ ఒకటిరెండు చిత్రాలు చేసిన రేష్మీ సహ నటీమణుల గ్లామర్ దాటికి తట్టుకోలేక, సరైన అవకాశాలు రాక చాలా మదనపడి చివరికి బుల్లితెరపై దృష్టి సారించింది. జబర్దస్త్లాంటి బుల్లి తెర కార్యక్రమాలతో అలరిస్తున్న రేష్మీ సినిమాల్లో రాణించాలన్న ఆశతో ఇతర హీరోయిన్లతో పోటీ పడడానికి తనూ గ్లామర్ బాట పట్టక తప్పలేదు. కురుచ దుస్తులకు, లిప్‌లాక్‌లకు, బెడ్రూమ్ సన్నివేశాలకు రెడీ అంటూ రంగంలోకి దిగిన ఈ అమ్మడు తాజాగా గుంటూర్ టాకీస్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో హీరోగా సిద్ధుతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించిందట. ఆ సన్నివేశాల దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సిద్ధుతో రేష్మీ ప్రేమకలాపాలు అంటూ ప్రసారాలు జోరందుకున్నాయి. సంగతి తెలిసిన రేష్మీ ఆగ్రహంతో రెచ్చిపోతుందని భావించిన వారికి ఆమె రియాక్షన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ నటి రేష్మీ స్పందన ఏమిటనుకుంటున్నారు? అవును నేను సిద్ధుతో డేటింగ్ చేస్తున్నాను. ఇది చెప్పడానికి నేనేమీ సంకోచించడంలేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, అందుకే ఆ చిత్రంలోని సన్నివేశాలలో మా మధ్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లకు మూతలు పడేలా చేసిందట. రేష్మీకి ఎంత డేర్ అంటున్నారిప్పుడు సినీవర్గాలు. -
ఐ లవ్ యు చెప్పలేదు!
బుల్లితెర ప్రేక్షకులకు రేష్మీ గౌతమ్ సుపరిచితురాలే. అడపాదడపా సినిమాలు కూడా చేస్తూ, తన ప్రతిభ నిరూపించుకుంటున్నారామె. తెలుగులో చకాచకా మాట్లాడే రేష్మి ఒరిస్సా అమ్మాయి. యాంకర్‌గా రాణించాలని పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆమె నటించిన ‘గుంటూరు టాకీస్’ మార్చి 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రేష్మి చెప్పిన ముచ్చట్లు... ♦ ‘ప్రస్థానం’లో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత అదే తరహా పాత్రలే రావడంతో, అంగీకరించలేదు. నటిగా నాకు నేను మహరాణి అని నా ఫీలింగ్. ఏ పాత్ర పడితే అది చేసి, నాలోని మహరాణిని తగ్గించుకోలేను. ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’కి అడిగినప్పుడు హ్యాపీగా ఒప్పుకున్నాను. ఎందుకంటే దర్శకుడిగా ఆయన స్టామినా ఏమిటో నాకు తెలుసు. ఈ చిత్రంలో నేను పొగరుబోతు పల్లెటూరి అమ్మాయిగా నటించాను. తక్కువ మేకప్, ఎక్కువ నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇది. ♦ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా నటించాను. పరిచయం లేని వ్యక్తులతో అలాంటి పాట చేయడం కష్టం. అందుకే, ఈ పాటను చివర్లో తీశారు. ఈలోపు నేను, హీరో సిద్ధు ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ రొమాంటిక్ సాంగ్ బాగా రావడానికి కారణం అదే. నాకు ఇలాంటి పాటలు చేయడానికి అభ్యంతరం లేదు. నా తదుపరి చిత్రం ‘తను వచ్చెనంట’. అందులోనూ మంచి పాత్ర చేస్తున్నా. ♦ చిన్నితెర తారలంటే చిన్నచూపు లేదని నా ఉద్దేశం. నిహారిక (నటుడు నాగబాబు కుమార్తె) సినిమా చేస్తోంది. అనసూయ కూడా సినిమాలు చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రేమ, పెళ్లి గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. ♦ నేను కొంచెం టామ్‌బాయ్ టైప్. అందుకే ‘ఐ లవ్ యు’ చెప్పడానికి అబ్బాయిలు సాహసించరు. నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు. తమిళ హీరో సూర్య అంటే ఇష్టం. వేరే ఎవరి మీదా క్రష్ లాంటివి ఏవీ లేవు. -
‘గుంటూర్ టాకీస్’ మూవీ స్టిల్స్
-
గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది
‘‘కొన్ని పాత్రలు చూసినప్పుడు నేను కూడా ఇన్ స్పైర్ అవుతుంటా. నటనలో నేనూ నిత్య విద్యార్థినే. నేను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ జరగడం సంతోషంగా ఉంది. ‘చందమామ కథలు’తో జాతీయ అవార్డందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సిద్ధు జొన్నగడ్డ, నరేశ్, రేష్మీ గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, మహేశ్ మంజ్రేకర్ ముఖ్యపాత్రల్లో ఆర్కె స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన చిత్రం - ‘గుంటూర్ టాకీస్’. ఈ చిత్రం ట్రైలర్‌ను బాలకృష్ణ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘ ‘అగ్ర హీరో బాలకృష్ణ గారు మా చిత్రం ట్రైలర్ ఆవిష్కరణకు రావడం మాకు కొత్త బలాన్నిస్తోంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ఏ భాషలో తీసినా ఘన విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న యూనివర్సల్ కథ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది’’ అని సీనియర్ నరేశ్ తెలిపారు. రేష్మి గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, సిద్ధు జొన్నగడ్డ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ తదితరులు మాట్లాడారు. కెమేరామ్యాన్ రామిరెడ్డి, ఎడిటర్ ధర్మేంద్ర, నటుడు రాజా రవీంద్ర, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో ఏం జరిగింది?
ఓ మెడికల్ షాప్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రేష్మీ గౌతమ్, సిద్ధు జొన్నలగడ్డ , నరేశ్ విజయకృష్ణ, మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్.ఎం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ‘‘సామాజిక అంశం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. గుంటూరులో ఓ ఫిలిం సిటీ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నా’’ అని చెప్పారు.ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: రామిరెడ్డి.పి. -
'అందమైన అమ్మాయి'గా రేష్మీ
హైదరాబాద్ : వెండి తెర నుంచి బుల్లి తెరకు ట్రాన్స్ఫర్ అయి... జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్‌గా... తన హావభావాలు, మాటల గారడితో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్న నటి రేష్మి ప్రస్తుతం మళ్లీ వెండి తెర మీద తన నట విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అది పల్లెటూరులోని అందమైన అమ్మాయి పాత్రలో రేష్మీ ఒదిగిపోనుంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో తాను పోషించనున్న పాత్రకు సంబంధించిన ముచ్చట్లను బుధవారం రేష్మీ విలేకర్లతో పంచుకున్నారు. ఓ పల్లెటూరు... అందులో స్లమ్ ఏరియా... అక్కడ నివసించే అందమైన అమ్మాయిగా నటిస్తునట్లు తెలిపింది. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే పాత్ర అని పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్న రెండు రోజుల ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనను కలసి చిత్రంలోని పాత్రను కళ్లకి కట్టినట్లు వివరించారని చెప్పింది. ఆ పాత్ర మనస్సుకు హత్తుకునేలా ఉందని... దీంతో కలిగిన ఆనందానికి ఉబ్బితబ్బియినట్లు పేర్కొంది. ఈ చిత్రంలోని అన్ని పాత్రలు కీలకమేనని.... అందరివి సమానమైన పాత్రలేనని వెల్లడించింది. ఈ చిత్ర బృందంతో నటిస్తుంటే కలిగే అనందం వేరంది. ప్రవీణ్ సత్తార్ ప్రముఖ దర్శకుడు. ఆయన చిత్రంలో నటించే నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ప్రవీణ్‌కు బాగా తెలుసునని రేష్మీ తెలిపింది. -
గుంటూరు కహానీ!
అది ఓ మెడికల్ షాపు. దాంట్లో పనిచేసే ఇద్దరు యువకులు అతితెలివితేటలతో చేసిన పని, వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ‘గుంటూరు టాకీస్’ చూడాల్సిందే. ‘చందమామ కథలు’ చిత్రంలో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ, సీనియర్ నరేశ్, లక్ష్మీ మంచు, మహేశ్ మంజ్రేకర్, శ్రద్ధాదాస్, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ - గుంటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం చాలా ఉత్కంఠతతో ఈ సినిమా సాగుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: శ్రీ చరణ్. -
పోలాండ్‌లో రివాల్వర్ రాణీ
టాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధదాస్ వరుస చిత్ర షూటింగులతో యమబిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం గుంటూరు టాకీస్. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలాండ్‌లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె రివాల్వర్ రాణీ పాత్ర పోషిస్తుంది. ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా పోలాండ్ తరలి వెళ్లింది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అనంతపురం జిల్లా హిందూపురంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు టాకీస్ చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు చిత్రంలో శ్రద్ధ సీఈవోగా నటిస్తుండగా... హిందీ చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలాండ్లోని క్రాకో నగరంలో దిగిన ఫోటోలను శ్రద్ధ తన మైక్రో బ్లాగ్‌లో ఉంచింది.