కథే హీరో | story Special in cinema | Sakshi
Sakshi News home page

కథే హీరో

Published Tue, Aug 30 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

కథే హీరో

కథే హీరో

 హీరో ఇంట్రడక్షన్ ఫైట్... ఆ వెంటనే సాంగ్...
 హీరోయిన్‌తో లవ్ ట్రాక్... విలన్‌తో ఫైట్ ట్రాక్...
 హీరో, విలన్లు మాటామాటా విసురుకుంటే, ఇంటర్వెల్ బ్యాంగ్...
 కాసింత కథ... చివరలో మళ్ళీ ఐటమ్ సాంగ్... ఆపైన క్లైమాక్స్ ఫైట్...

 
తెలుగు సినిమా కథను... ఎప్పుడో కంచికి చేర్చేసిన ‘ఆరు పాటలు, మూడు ఫైట్ల’ మూస ఫార్ములా ఇది. మరి, ఈ మూసను బద్దలుకొట్టేదెవరు? ఎప్పుడు?   ‘ఎప్పుడో కాదు... ఇప్పుడే’ అంటున్నాయి కొన్ని కొత్త సినిమాలు. హీరో ఎవరన్నది కాదన్నయ్యా... కథ, కథనం కొత్తగా ఉన్నాయా, లేవా అన్నది ఇప్పుడు పాయింట్.   లెటజ్ వెల్కమ్ న్యూ ఏజ్ తెలుగు సిన్మా.
 
‘‘మా దర్శక, రచయితల్లో వచ్చినంత వేగవంతమైన మార్పు నిర్మాతల్లో కనిపించడం లేదు. ఒక్క ఎదురుదెబ్బ తగిలినా, ఒక్క మాస్ సినిమా హిట్టయినా - మళ్ళీ అందరూ రొటీన్ బాక్సాఫీస్ ఫార్ములా వెంటే వెళ్ళిపోతున్నారు. అందుకే, ఇప్పుడు న్యూ ఏజ్ డెరైక్టర్స్, రైటర్స్ లాగానే న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన టైమ్ వచ్చేసింది. వాళ్ళు ఎంతమంది వస్తే, అంత త్వరగా తెలుగు సినిమా - కథే హీరోగా కొత్త తీరాలకు వెళుతుంది’’  
 - ‘గుంటూరు టాకీస్’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు  

జూలై 29...
సమ్మర్ సీజన్ అయిపోయాక సినిమా హాళ్ళు కొద్దిగా పల్చబడిన టైమ్...
‘పెళ్ళిచూపులు’... చిన్న సినిమా. చిన్న స్థాయిలోనే రిలీజైంది.
 
హీరో విజయ్ దేవరకొండ... ‘ఎవడే సుబ్రమణ్యం’లో హీరో నాని ఫ్రెండ్ పాత్ర మినహా పెద్దగా తెలిసిన ముఖమేమీ కాదు. హీరోయిన్ రితూ వర్మ ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పిల్ల. దర్శకుడు? తరుణ్ భాస్కర్... ఇదే ఫస్ట్ ఫిల్మ్.
 
కానీ, రిజల్ట్ అందుకు పూర్తి భిన్నం. చిన్నస్థాయిలో రిలీజైనా, ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్! తరువాత కొద్ది రోజులకే వెంకటేశ్, సాయిధరమ్ తేజ్ లాంటి పేరున్న హీరోల సినిమాలు వచ్చినా, జనం చూపు ‘పెళ్ళిచూపులు’ దగ్గరే నిలిచిపోయింది.
 
 పేరున్న యాక్టర్లు, టెక్నీషియన్లు లేరన్న మాటే కానీ, ఒకరనుకొని మరొకరిని పొరపాటున పెళ్ళిచూపులు చూసుకున్న హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ ‘రొమాంటిక్ కామెడీ’ చిత్రం పెద్ద పెద్దవాళ్ళ సినిమాల కన్నా బాక్సాఫీస్ వద్ద భారీగా కాసులు తెచ్చింది. పెట్టిన ఖర్చుకీ, వచ్చిన రాబడికీ లెక్క చూస్తే - టాప్ హీరోలను తలదన్నేలా లాభాలూ నిర్మాతకు ఇచ్చింది. అవును. అందుకే... ఇప్పుడు టాప్ స్టార్స్ కాదు... కథే అసలు సిసలు హీరో!
 
ఇవాళ - సినిమాలో టాప్ స్టార్స్ ఉన్నప్పటికీ, జనాదరణ ఎంత ఉంటుందనేది చెప్పలేం. అదే గనక - కథ కొత్తగా ఉంటే సూపర్! కథ బాక్సాఫీస్ ఫార్ములా ఫక్కీలో కాస్తంత పాతదే అయినా సరే, కథనం గనక ఆసక్తికరంగా ఉంటే... సూపర్ డూపర్! అలాంటి సినిమాలకు న్యూ ఏజ్ ఆడియన్స్ జై కొడుతున్నారు. గత ఏడాది విడుదలైన ‘భలే మంచి రోజు’, ‘గుంటూరు టాకీస్’ల నుంచి ఈ ఏటి ‘క్షణం’, లేటెస్ట్ ‘పెళ్ళిచూపులు’, ‘శ్రీరస్తు - శుభమస్తు’ దాకా అదే వరస! ఈ సినిమాలన్నీ జనం మెప్పూ పొందాయి... డబ్బులూ తెచ్చాయి.

తెలుగు తెరపై... ఇప్పుడు వీస్తున్న గాలి!
నటిస్తున్నప్పుడే డైలాగ్స్ కూడా రికార్డ్ చేసే ‘సింక్ సౌండ్’ విధానంతో, సినిమాలా కాకుండా జీవితాన్ని చూపిస్తున్నట్లు సాగిన నిజాయతీ నిండిన ప్రయత్నం ‘పెళ్ళి చూపులు’ రొమాంటిక్ కామెడీ జానర్‌కి కొత్త తరహా ఎక్స్‌టెన్షన్. ఇక, అల్లు శిరీష్ నటించిన లవ్‌స్టోరీ ‘శ్రీరస్తు - శుభమస్తు’ పెద్ద అంచనాలు లేకుండానే విడుదలైనా, మాస్ మెప్పు పొందింది. కథగా కన్నా, హాస్యం నిండిన కథనంతో ఆకర్షించింది.
 
దశాబ్దిన్నర క్రితం ‘ఐతే’ రోజుల నుంచి అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ‘మనమంతా’తో మిగతావాళ్ళ కన్నా తన కథ, కథనం భిన్నమని మళ్ళీ నిరూపించారు. నిజానికి, కథనే నమ్ముకొని సినిమా తీయడం తెలుగు సినిమా ఒకప్పుడు అనుసరించిన పద్ధతే. ఆరు పాటలు, మూడు ఫైట్ల మూసలోకి జారిపోయాకనే కథ బదులు హీరో, మిగతా హంగులకు పెద్ద పీట పడింది. మధ్య మధ్యలో కొన్ని మెరుపులు మెరిసినా, గడచిన ఏడాది పై చిలుకుగా ‘భలే మంచి రోజు’, ‘రాజు గారి గది’, ‘గుంటూరు టాకీస్’, ‘క్షణం’ లాంటి కొత్త తరహా తెలుగు సినిమాలు తరచూ రావడం మొదలైంది.

తమిళం, మలయాళమే కాదు... మనమూ!     
నిన్న మొన్నటి వరకు ఈ రకమైన కొత్త తరహా సినిమా అంటే, తమిళ, మలయాళ సినిమాలే కేరాఫ్ అడ్రస్ అన్నట్లు మాట్లాడేవాళ్ళం. కొత్త తరహా కథలు, లో-బడ్జెట్ ప్రయత్నాలు అక్కడే ఎక్కువ. కానీ, ‘యూ ట్యూబ్’ సంస్కృతి, టారెంట్ సైట్స్ పుణ్యమా అని ఆ సినిమాలన్నీ వెంటనే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
 
ఆ కొత్త తరహా ప్రయత్నాలు చకచకా ఇక్కడి మనవాళ్ళకూ వెంటనే తెలిసొస్తున్నాయి. మరోపక్క డిజిటల్ టెక్నాలజీ, సినిమాల్లోకి వచ్చేందుకు వీసాగా తయారైన షార్ట్ ఫిల్మ్స్‌తో కొత్త తరం ఫిల్మ్‌మేకర్స్ ముందుకొస్తున్నారు. సినిమాను కేవలం నిజజీవితం నుంచి ఒక ఎస్కేపిస్ట్ రూట్‌గా కాకుండా, జీవితానుభవంలోని ఒక శకలానికి ప్రతిరూపంగా మార్చాలనే ధోరణికి కాస్తంత బలం వచ్చింది. ఇవన్నీ కలవడంతో - తమిళ, మలయాళాల అంత ఉద్ధృతంగా కాకపోయినా తెలుగు తెర మీదా ఇప్పుడు కొత్త గాలి వీయడం మొదలైంది. స్టోరీనే నమ్ముకొని దర్శక, నిర్మాతలు అడపాదడపానైనా ముందుకొస్తున్నారు.
 
కొత్తదనం ఉంటే సరిపోతుందా?
సినిమాల్లో, ప్రేక్షకుల్లో మార్పు వస్తోంది సరే! మరి, మార్పుకు బాసటగా నిలిచే ఈ కొత్త ప్రయత్నాలన్నీ బాక్సాఫీస్ హిట్లేనా? అలాగని గ్యారెంటీ ఏమీ లేదు! లేటెస్ట్‌గా ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘మనమంతా’ కూడా కొత్త తరహా ప్రయత్నమే! ప్రతి ఒక్కరూ సినిమా స్లోగా అనిపించినా, చివరి అరగంటా మరపురాని అనుభూతి అన్నారు. నాలుగు జీవితాల సమాహారంగా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆ నాలుగు కథలూ ఒకదానికొకటి ముడిపడేలా, రొటీన్‌కు భిన్నంగా సాగుతుందీ సినిమా. గౌతమి, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ లాంటి ప్రముఖులూ ఉన్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, కథన లోపాలు, పబ్లిసిటీ - మార్కెటింగ్ వ్యూహాల్లో అలసత్వం దెబ్బతీశాయి. కథలో కొత్తదనం ఎంత ఇంపార్టెంటో, జనసామాన్యం దగ్గరకు దాన్ని తీసుకువెళ్ళడం అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తు చేసింది.
మారాల్సింది నిర్మాతలేనా?
ఇలాంటి ఎదురుదెబ్బల్ని సహించి, మారుతున్న కాలానికీ, ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్లు ముందుకొచ్చే నిర్మాతలు ఇప్పటికే తక్కువే. ఇవాళ అందరూ గొప్పగా మెచ్చుకుంటున్న ‘పెళ్ళిచూపులు’ స్క్రిప్ట్ పట్టుకొని ఆ చిత్ర దర్శక- రచయిత తరుణ్ భాస్కర్ మూడేళ్ళు పలువురు నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చిందంటే నమ్ముతారా? ప్రవీణ్ సత్తారు కూడా అంతే. అయిదేళ్ళ క్రితం ‘ఎల్.బి.డబ్ల్యు’, తరువాత ‘చందమామ కథలు’ లాంటి కొత్త తరహా ప్రయత్నాలు చేసి, ఆర్థికంగా కన్నా హార్దిక ప్రశంసలే అందుకున్నారు.
 
తరుణ్ కానీ, ప్రవీణ్ కానీ పట్టుదలగా ప్రయత్నాలైతే మానలేదు. చివరకు, సమాజంలోని ఇద్దరు సామాన్య దొంగల జీవితం చుట్టూ తిరిగే ‘గుంటూరు టాకీస్’తో ప్రవీణ్‌ను బాక్సాఫీస్ విజయం వరించింది. 2 కోట్ల లోపు బడ్జెట్‌తో తయారైన ఆ సినిమా కేవలం హాళ్ళలోనే రూ. 10 కోట్ల పైగా వసూలు చేసింది. ఆ ఊపుతో ప్రవీణ్ ఇప్పుడు మూడు విభిన్న తరహా కథలతో సినిమాలు తీయనుండడం విశేషం.
 
తాజాగా రాజశేఖర్‌తో తీస్తున్న యాక్షన్ స్టోరీ, పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తీసే సినిమా, ఆ తరువాత తీసే లవ్‌స్టోరీ - మూడూ కూడా కథనే హీరోగా నడిపే కొత్త ప్రయత్నాలట. మరోపక్క ‘షార్ట్ ఫిల్మ్స్’ రూట్ నుంచి దర్శకుడైన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ అరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌తో సినిమా చేయడానికి పెద్ద హీరోలు రెడీ అవుతున్నారు. మతిమరుపున్న హీరో (‘భలే భలే మగాడివోయ్’లో నాని), వీల్ ఛెయిర్‌కే పరిమితమైన నాయకుడు (‘ఊపిరి’లో నాగ్) లాంటి కొత్త తరహా ప్రయత్నాలు క్రమంగా పెరుగుతున్నాయి. సమాజం లాగానే, ప్రతి పదేళ్ళకొకసారి తెలుగు సినిమా కూడా మారుతోందనడానికి ఇవన్నీ తాజా సూచనలు! మంచి సినిమా కోసం ఎదురుచూపులతో ఉన్నవారికి తీపి కబుర్లు!
 
మనలో ఈ మార్పు ఎలా మొదలైంది?
కొత్త శతాబ్ది ప్రేక్షకులు ఇప్పుడు కొత్త వర్గాలుగా తయారయ్యారు. వారం వారం వస్తున్న రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాల మధ్య కొత్త దనం కోరుకోవడం పెరిగింది. పట్టణ, గ్రామీణ వర్గాల అభిరుచుల తేడాలతో పాటు, మల్టీప్లెక్సులు పెరిగిపోతున్న వేళ - ‘మల్టీప్లెక్స్ కల్చర్, ఆడియన్స్’ అనే కొత్త వర్గీకరణ వచ్చి చేరింది. అలాగే, విదేశాల్లో హాలీవుడ్ చిత్రాలు అలవాటై, తెలుగు సినిమాల్లో కొత్తదనం కోరుకుంటున్న ప్రవాస భారతీయులు కూడా ‘ఓవర్‌సీస్ ఆడియన్స్’ అనే కొత్త వర్గం కింద విలక్షణంగా నిలిచారు.
 
ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, కామెడీ లాంటి కొన్ని కోవల సినిమాలకు పర్మినెంట్ ఆడియన్స్‌గా మారారు. ఆ సినిమాల ఓవర్‌సీస్ కలెక్షన్స్‌కి పెట్టనికోట అయ్యారు. కొత్త తరహా కథలు, కథనాలతో సినిమా వస్తే చాలు... ఠక్కున అక్కున చేర్చుకుంటున్నారు. అటు ఓవర్‌సీస్ మార్కెట్, ఇటు మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోవడంతో పాటు ప్రధాన ఆదాయ వనరులయ్యాయి. అంతే! తెలుగు సినిమా కొత్త గెటప్ వేసుకొంది. ఆలస్యంగా, అతి నిదానంగా అయినా సరే మన సినిమా క్రమంగా మారడం మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement