మరో ఆరు వారాల్లో ‘అవతార్’ కథలు రెడీ!
ఒక సినిమాని ఒక సంవత్సరం.. మహా అయితే రెండు మూడేళ్లు తీస్తారు. హాలీవుడ్ సినిమా అయితే ఇంకో ఏడాది అదనంగా అవ్వొచ్చు. కానీ, ‘అవతార్’ చిత్రాన్ని జేమ్స్ కామరూన్ దాదాపు ఇరవైఏళ్లు తీశారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ‘ఇదేం విడ్డూరం.. ఇన్నేళ్లా’ అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత ‘అద్భుతమైన సాంకేతిక మాయాజాలం’ అని ఒప్పుకున్నారు. మరో, 20, 30 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేమని కూడా అన్నారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టింది.
ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్స్ తీయడానికి సిద్ధమవుతున్నారు కామరూన్. సీక్వెల్ 2, 3, 4 చిత్రాలను ఏకకాలంలో రూపొందించనున్నారు. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న కామరూన్ ఈ విషయం చెప్పారు. మరో ఆరు వారాల్లో ఈ సీక్వెల్స్‌కి సంబంధించిన కథలు పూర్తవుతాయని పేర్కొన్నారు. తొలి భాగంలో ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ నటించారు కదా.. ఈ సీక్వెల్స్‌లోనూ ఆయన ఉంటారా? అనే ప్రశ్నకు.. ‘‘ఈ మూడు కథల్లో ఆర్నాల్డ్‌కి నప్పే పాత్ర లేదు. అందుకని ఆయన ఉండకపోవచ్చు’’ అన్నారు. కొత్త సినిమా అయినా, సీక్వెల్ అయినా.. ఏదైనా ఒత్తిడికి గురి చేస్తుందని, తన కెరీర్ మొత్తం ఈ ఒత్తిడ్ని అనుభవిస్తూ వస్తున్నానని, ఇప్పుడూ అదే స్థితిలో ఉన్నానని కామరూన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కోసం భారీ సెట్స్ వేయిస్తున్నామని, అలాగే, గ్రాఫిక్స్‌లో పలు కేరక్టర్లను సృష్టిస్తున్నామని చెప్పారు.