హాలీవుడ్‌లో సీక్వెల్ అనగానే దాదాపు అందరి దృష్టి ‘అవతార్’ మీద ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు (2022) పట్టింది. మూడు, నాలుగు, ఐదు భాగాలను ప్రకటించారు కామెరూన్. మూడో భాగం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ‘అవతార్’ అభిమానులను ఇది నిరాశపరిచే విషయమే. అయితే ఈ ఏడాది దాదాపు పది సీక్వెల్స్ రానున్నాయి. పలు హిట్ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న ఆ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం.
సమ్మర్‌లో సైన్స్ ఫిక్షన్
ఈ వేసవికి రానున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017)కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగం. మూడు భాగాలూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియమ్ టీగ్, ఫ్రెయా అలన్ తదితరులు నటించారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఫుల్ యాక్షన్‌తో బ్యాడ్ బాయ్స్
జూన్‌లో బ్యాడ్ బాయ్స్ తెరపైకి రానున్నారు. బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. 2003లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’కి నాలుగో భాగం ఇది. మూడో భాగం ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’ (2020) విడుదలైన నాలుగేళ్లకు వస్తోన్న సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో డిటెక్టివ్ ల్యూటినెంట్ మైఖేల్‌గా లీడ్ రోల్‌ని విల్ స్మిత్ చేశారు. రెండో, మూడో భాగానికి దర్శకత్వం వహించిన ఆదిల్, బిలాల్ ద్వయం తాజా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. నాలుగు భాగాల్లోనూ మైఖేల్ పాత్రను విల్ స్మిత్‌నే చేశారు. యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది.
ఆరేళ్లకు డెడ్‌పూల్
ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డ సీక్వెల్ చిత్రాల్లో ‘డెడ్‌పూల్ 3’ది ప్రముఖ స్థానం. ర్యాన్ రేనాల్డ్స్ టైటిల్ రోల్‌లో షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మార్వెల్ కామిక్ బుక్స్‌లోని డెడ్‌పూల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిన తొలి చిత్రం ‘డెడ్‌పూల్’ (2016). టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్‌పూల్ 2’ (2018) కూడా బంపర్ హిట్. ఆరేళ్లకు మూడో భాగం ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్’ వస్తోంది. మూడు భాగాల్లోనూ డెడ్‌పూల్ పాత్రను ర్యాన్ రేనాల్డ్స్ చేశారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
హారర్ జూయిస్
దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ‘బీటిల్ జూయిస్’ (1988) సంచలన విజయం సాధించింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ పోషించారు. దాదాపు 35 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా టిమ్ బర్టన్ దర్శకత్వంలోనే ‘బీటిల్ జూయిస్ 2’ రూపొందింది. సీక్వెల్‌లోనూ బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది.
అక్టోబర్‌లో జోకర్
అక్టోబర్ నెల రెండు సీక్వెల్స్‌ని చూపించనుంది. ఒకటి ‘జోకర్’ సీక్వెల్... మరోటి ‘వెనమ్’ సీక్వెల్. అమెరికన్ కామిక్స్ ఆధారంగా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జోకర్’ (2019). టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోకర్ అనే ఆర్థర్ ఫ్లెక్స్ పాత్రను జోక్విన్ ఫీనిక్స్ పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ‘జోకర్’కి సీక్వెల్‌గా ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ చిత్రం రూపొందింది. అక్టోబర్ 4న ఈ జోకర్ తెరపైకి రానున్నాడు.
ఇదే ఆఖరి వెనమ్
కొలంబియా పిక్చర్స్ నిర్మించిన స్పైడర్‌మేన్ యూనివర్స్‌లో ఆరో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్. ‘వెనమ్’ (2018), ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఈ మూడో భాగంతో ‘వెనమ్’ సీక్వెల్ ముగుస్తుందని టాక్. కెల్లీ మార్సెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెనమ్ పాత్రను టామ్ హార్డీ పోషించారు. ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వేతనాల పెంపుకి రచయితలు చేపట్టిన సమ్మె వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
రెండు దశాబ్దాలకు గ్లాడియేటర్
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గ్లాడియేటర్’ (2000) అనూహ్యమైన విజయం సాధించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రసెల్ క్రో, జోక్విన్ ఫీనిక్స్ తదితరులు నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోనే రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. పౌల్ మెస్కల్, డెంజల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సోనిక్ ది హెడ్‌హాగ్ 3’ డిసెంబర్ 20న, అదే రోజున యానిమేటెడ్ మూవీ ‘హూ ఫ్రేమ్డ్ రాగర్ రాబిట్ 2’, ‘ది కరాటే కిడ్’ ఆరో భాగం డిసెంబర్ 13న... ఇంకా వీటితో పాటు ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment