టెర్మినేటర్ అంటే తెలుగు ప్రేక్షకులకూ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గరే గుర్తొస్తారు. ఇప్పటివరకు ‘టెర్మినేటర్’ సిరీస్ (ఐదు సిన్మాల్లో)లో ఈ ఇంగ్లీష్ హీరో అంతలా ఇరగదీసి నటించారు. అయితే... ‘టెర్మినేటర్’కి, ‘అవతార్’కి లింక్ ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా! ‘అవతార్’ అంటే ముందుగా గుర్తొచ్చేదెవరు? ఆ చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘టెర్మినేటర్’ సిరీస్‌లో ఫస్ట్ రెండు సిన్మాలకు దర్శకుడూ ఆయనే. కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన ‘టెర్మినేటర్–2’ ఆల్మోస్ట్ 525 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. సెకండ్ పార్ట్ విడుదలైన పన్నెండేళ్లకు వచ్చిన మూడో పార్ట్ ‘టెర్మినేటర్ 3: రైజ్ ఆఫ్ ద మెషీన్స్’ (2003) గానీ, తర్వాత ‘టెర్మినేటర్ సాల్వేషన్’ (2009) గానీ, ఐదో పార్ట్ ‘టెర్మినేటర్ జెనిసిస్’ (2015) గాని రెండో పార్ట్ వసూళ్లను దాటలేదు.
కారణం అదేనో... మరొకటో... ఆరో పార్ట్ హక్కులు మళ్లీ కామెరూన్ చేతికి వచ్చాయి. అయితే... ‘టెర్మినేటర్–2’కి సీక్వెల్‌గా రూపొందనున్న ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహించడం లేదు. కథారచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బిల్లీ రేతో కలసి కథ రాసిన కామెరూన్, డేవిడ్ ఎల్లీసన్‌తో కలసి ‘టెర్మినేటర్–6’ను నిర్మిస్తున్నారు. ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకుడు. స్క్రిప్ట్ అండ్ ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ మొదలై చాలా రోజులైంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట! ద బ్రెయిన్ బిహైండ్ టెర్మినేటర్... కామెరూన్ మళ్లీ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌తో కలవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇంతకీ ఆరో ‘టెర్మినేటర్’ ఎప్పుడు వస్తుందో తెలుసా? 2019లో.
Comments
Please login to add a commentAdd a comment