ప్రేమ, కామెడీ జత కలిసే? | Jatha Kalise Telugu Movie Review | Sakshi
Sakshi News home page

ప్రేమ, కామెడీ జత కలిసే?

Published Sat, Dec 26 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

ప్రేమ, కామెడీ జత కలిసే?

ప్రేమ, కామెడీ జత కలిసే?

చిత్రం : 'జత కలిసే'
తారాగణం : అశ్విన్బాబు, తేజస్వి
సంగీతం : ఎం.సి.విక్కీ, సాయి కార్తీక్
కెమేరా : జగదీశ్
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
నిర్మాతలు : నరేశ్ రావూరి
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : రాకేశ్ శశి

ప్రయాణంలో పదనిసలు తరహా రోడ్ జర్నీ కథలు తెరపై సుపరిచితమే. ఆ బ్యాక్‌డ్రాప్ తీసుకొని, ప్రేమ, పెళ్ళి, జీవితాశయం లాంటి అంశాలను కలగలిపి కథ అల్లుకుంటే? ఈ ఆలోచనతో చేసిన యత్నం- ‘జత కలిసే’.
 అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతుంటాడు ఋషి (అశ్విన్ బాబు). అతను తన స్నేహితుడి పెళ్ళి కోసం వైజాగ్ వస్తాడు. తీరా అక్కడ పెళ్ళికొడుకుతో తాగుడు పందెం కట్టి, ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణమవు తారు - హీరో, అతని ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో అమెరికా తిరుగు ఫ్లైట్ ఎక్కడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ట్యాక్సీలో బయలుదేరతాడు హీరో.

వైజాగ్‌లోనే సూర్య (సూర్య) దంపతుల కూతురు తేజస్వి అలియాస్ పింకీ (తేజస్వి). ఐ.ఏ.ఎస్. ఇంటర్వ్యూ కోసం ఈ హీరోయిన్ కూడా హీరోతో ఒకే ట్యాక్సీలో హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి పెళ్ళి చెడిపోయింది తాగుబోతులైన హీరో బృందం వల్లేనని గుర్తించిన హీరోయిన్ వాళ్ళకు బుద్ధిచెప్పాలని రంగంలోకి దిగుతుంది.

కలసి ప్రయాణిస్తున్న హీరో గారికి తెలియకుండానే, ఎఫ్.ఎం. రేడియో, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ లాంటి వాటిని ఆశ్రయించి, హీరో బ్యాచ్ గురించి గబ్బు రేపుతుంది. ఈ లోగా ఒకటీ అరా పాటలు... హీరో హీరోయిన్ల లవ్ సిగ్నల్స్... హీరోయిన్ మంచితనం చూపే ఘట్టాలు వస్తాయి. ఇంతలో ఆ అమ్మాయే తమపై దుమారం రేపుతోందని హీరో కనిపెడతాడు. అక్కడికి ఇంటర్వెల్.  
 
సెకండాఫ్ మొదలయ్యాక తాను మంచివాడినేనన్న సంగతి హీరోయిన్‌కు అర్థమయ్యేలా చేస్తాడు హీరో. ఒక దశలో హీరోయిన్ అక్క తన భర్తతో పొసగక, బెంగుళూరులో ఆత్మహత్య చేసుకోబోతుంటే, ‘స్వీట్ మెమొరీస్’ సీడీ చూడమంటూ ఫోన్‌లోనే చెప్పి, ఫ్యామిలీ కౌన్సెలర్ అవతారమూ ఎత్తుతాడు. ఆ తరువాత ఏమైంది? హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు ఏమయ్యాయి అన్నది మిగతా సినిమా. నట-దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్‌బాబు హీరోగా హుషారుగా చేసిన మరో ప్రయత్నమిది.

తేజస్వి ఎప్పటిలానే చలాకీతనంతో కనిపిస్తారు. ఇక, లేడీ ట్యాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్ధ, వారానికి ఆరు రోజులే డ్యూటీలో ఉండే దొంగ కల్యాణ్‌బాబు పాత్రలో షకలక శంకర్ లాంటివాళ్ళు వినోదమందిస్తారు. ధన్‌రాజ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి లాంటి ఇతర కమెడియన్లు కూడా ‘ఆఖరి నిమిషంలో పాలుపంచుకొని’, తెరపై నవ్విస్తారు. ‘గబ్బర్‌సింగ్’ మొదలు తాజా ‘శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్, బెంగాల్ టైగర్’ దాకా పలు చిత్రాల్ని అనుకరిస్తూ, సైటైరికల్ స్పూఫ్ ఒకటి చేశారు.

మందు సీసా మీద ఓపెన్ అయి, ఒక పాటతో సహా చాలాసేపు మద్యం వాసన కొట్టే ఈ సినిమా ముగింపు కూడా ఆసక్తికరంగా మద్యం తాగననే హీరో ఒట్టుతోనే! కథ చిన్నది కాబట్టి, కథనం కోసం సందర్భాలు, సన్నివేశాలు అనేకం అల్లుకుంటూ వెళ్ళిన ఈ ఫిల్మ్‌లో లాజిక్‌లు వెతకకూడదు. ఇటు పూర్తి కామెడీ సినిమా చేయాలా, అటు రోడ్ జర్నీలో రొమాంటిక్ ఫిల్మ్ తీయాలా అనే విచికిత్స దర్శక, నిర్మాతలను వెంటాడి నట్లు అనిపిస్తుంది.

ఆ సక్సెస్ ఫార్ములా అన్వేషణలో పాత్రల ప్రవర్తన తీరు ఇ.సి.జి. గ్రాఫే. కథలానే సినిమా ఎక్కడో వైజాగ్‌లో మొదలై ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కొన్నేళ్ళ క్రితం పెట్టిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో బహుమతి అందుకొన్న రాకేశ్ శశికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. అతనికి ఆ పాత వాసనలు ఇంకా పోలేదని గుర్తుచేస్తుంది. ఏమైనా స్పూఫ్ కామెడీ, సవాలక్ష ప్రేమకథల రెడీ మిక్స్  ‘జత కలిసే’నా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement