రొమాన్స్ లేదని ఫీలయ్యా
రొమాన్స్ లేదని ఫీలయ్యా
Published Tue, Dec 24 2013 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
నటి త్రిషతో రొమాన్స్ సన్నివేశాలు లేవని ఫీలైనట్లు నటుడు జీవా పేర్కొన్నారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ఎండ్రెండ్రుం పున్నగై. వినయ్, సంతానం, ఆండ్రి యా, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి యువ దర్శకుడు అహ్మద్ దర్శకత్వం వహించారు. తమిళ కుమారన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ రామ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. రెడ్ జైయిన్ మూవీస్ సంస్థ ద్వారా గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణ పొందిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం మధ్యాహ్నం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అహ్మద్ మాట్లాడుతూ ఎండ్రెండ్రుం పున్నగై చిత్ర విజయం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. అయితే ఈ విజయం వెనుక శ్రమ చాలా ఉందన్నారు. యూనిట్ సమష్టి కృషి వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యం అయ్యిందని అన్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభూతిగా నటి త్రిషపేర్కొన్నారు. నటుడు జీవా మాట్లాడుతూ తాను చేసిన మంచి పని ఈ చిత్రాన్ని అంగీకరించడం అన్నారు. కొందరు చిత్రం చేయొద్దని కూడా సలహా ఇచ్చినట్లు చెప్పారు.
కొన్ని సమయాల్లో స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది మల్టీస్టారర్ చిత్రం అని అన్నారు. వినయ్, సంతానం, త్రిష, ఆండ్రియా తదితరులతో నటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే తొలుత ప్రతి సన్నివేశంలోనూ వినయ్, సంతానంతో నటించడంతో త్రిషతో రొమాన్స్ సన్నివేశాలు లేవేమోనని కాస్త ఫీలయిన మాట నిజమన్నారు. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లో మా ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడంతో సంతృప్తి చెందినట్లు తెలిపారు. చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతం దోహదం చేసిందన్నారు.
Advertisement
Advertisement