హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ తన గర్ల్‌ఫ్రెండ్, టాప్ మోడల్ హేలీ బోల్డ్‌విన్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు బీబర్. ఈ సందర్భంగా పెళ్లిలో ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పాలంటూ అభిమానుల అభిప్రాయం కోరాడు. ఈ మేరకు... ‘పెళ్లి డ్రెస్ ఎంపికలో నాకు సహాయం చేయండి. ఈ ఐదింటిలో ఏ సూట్ బాగుందో చెప్పండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో బీబర్ ఇన్‌స్టా అకౌంట్‌కు ఉన్న 119 మిలియన్ల ఫాలోవర్లలో ఎక్కువ మంది ఇంధ్రధనుస్సు రంగులతో కూడిన సూట్‌కే ఓటు వేశారు. మరికొంత మంది మాత్రం బేబీ పింక్ కలర్‌లో ఉన్న సూటైతే మీకు అదిరిపోతుంది బాస్ అని కామెంట్లు పెడుతుండగా.. ఇంకొంత మంది.. ‘ఈ డ్రెస్సులన్నీ భలేగా ఉన్నాయి. ఈ కలెక్షన్ ఎక్కడ దొరికింది’ అంటూ ఫన్నీగా బీబర్‌కు బదులిస్తున్నారు.
అయ్యో అసలు విషయం చెప్పలేదు కదూ.. బీబర్ మరోసారి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. అతడి భార్యనే. అవును కొన్ని నెలల కిందట హేలీని రహస్యంగా పెళ్లి చేసుకున్న బీబర్ ప్రస్తుతం అట్టహాసంగా వివాహ వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో పాప్ సింగర్ సెలీనా గోమెజ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన బీబర్.. ఆమెకు పలుమార్లు బ్రేకప్ చెప్పినప్పటికీ ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో జలీనా జంట(సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు) మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో తాము విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అంగీకారంతో తన మరో గర్ల్‌ఫ్రెండ్ హేలీతో నిశ్చితార్థం చేసుకున్న బీబర్.. ఆమెను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ కరోలినాలోని ఓ అందమైన ప్రదేశంలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment