చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్‌ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు.
ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.