22న కబాలి
యావత్ సినీ వర్గాలు, ప్రేక్షకులు, ముఖ్యంగా సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఏ చిత్రానికి రానంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం కబాలి అనడం అతిశయోక్తి కాదేమో. ఈ చిత్రానికి ప్రసార మాధ్యమాలు కూడా చాలానే ప్రచారం చేశాయని చెప్పక తప్పదు. కారణం ఒక్కటే. ఇందులో కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి.
మొట్టమొదటి సారిగా మలయాళం భాషలో అనువాదమై విడుదలవుతున్న భారతీయ చిత్రం కబాలి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న చిత్రం కబాలి. రాధిక ఆప్టే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల గురించి రకరకాల ప్రచారం జరిగింది. జూలై 22న, 29న, ఆగస్టు 15న విడదల ఇలా ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేశారు.
అయితే చిత్ర నిర్మాత మాత్రం కబాలి చిత్ర విడుదల విషయంలో నిర్ధిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. చిత్రాన్ని సోమవారం సెన్సార్‌కు పంపారు. అదే రోజు మూడు గంటలకు సెన్సార్ బోర్డు సభ్యుల బృందం చిత్రాన్ని చూశారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందించారు. వెంటనే నిర్మాత కలైపులి ఎస్.థాను అనుకున్న విధంగా ఈ నెల 22నే కబాలి విడుదల అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇంతకు ముందు కబాలి విడుదల విషయంలో అభిమానుల్లో కాస్త గందరగోళం ఏర్పడగా నిర్మాత స్పష్టతతో వారితో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. కబాలి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం కూడా కబాలి కావొచ్చు. ఇలా విడుదలకు ముందే సంచలన రికార్డులు బద్దలు కొడుతున్న మన స్టైల్ కింగ్ చిత్రం విడుదల అనంత రం ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. కబాలిడా..నెరుప్పుడా..