కబాలి మొదటి రోజు వసూలెంతో తెలుసా?
తమిళసినిమా: విడుదలకు ముందే కాదు ఆ తరువాత కూడా కబాలి గురించి కథనాలు కదం తొక్కుతున్నాయి.ఆ క్రెడిట్ అంతా సూపర్‌స్టార్ రజనీకాంత్‌దేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా శుక్రవారం తెరపైకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ప్రపంచవ్యాప్త రజనీ అభిమానులు ఎదురు చూశారు.ఇప్పుడు చూస్తూ (మగిల్చి)సంతోషపడుతున్నారు.కబాలి చిత్రం వారిలో పండగ వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఉత్సవాలు జరుపుకుంటున్నారు.రజనీకాంత్ చిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూడటం ఘనతగా భావిస్తున్నారు.చూసిన వారిలో ఏదో సాధించాయన్న ఫీలింగ్.
థియేటర్ల ముందు ఇసుకేస్తే రాలనంత జనం. 90 శాతం టికెట్లు ముందుగానే రిజర్వేషన్ అయ్యి పోవడంతో టికెట్లు దొరకని వారు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ధర చెల్లించి అయినా కబాలి చిత్రం చూసి తీరాలనే నిర్ణయంతో తమ ప్రయత్నాలు చేయడం అన్నది ఒక్క కబాలి చిత్రానికే చెల్లుతుంది.ఒక్క భారతరేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా కబాలి చిత్రంపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా,మలేషియా,సింగపూర్ మొదలగు 50 దేశాలలో ఈ చిత్రం హవా కొనసాగుతోంది.చిత్రం చూసిన రజనీ అభిమానులు ఆనందతాండ వం చేస్తున్నారనే చెప్పవచ్చు.
6,500 థియేటర్లలో కబాలి
కబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 థియేటర్లకు పైగా విడుదలైంది.ఇందులో 3,500 థియోటర్లకు పైగా హౌస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతున్నాయి. 2వేల థియేటర్లలో వారానికి పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది.ఇక తమిళనాడు,కేరళ,ఆంధ్రా,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో కబాలికి అమోఘ ఆదరణ లభిస్తోంది.
మొదటి రోజు వసూళ్లు రూ.40 కోట్లు
చిత్ర ప్రారంభం నుంచి రికార్డులకు శ్రీకారం చుట్టిన కబాలి విడుదలకు ముందే నిర్మాతకు రూ.200 కోట్లు టేబుల్ ప్రాపర్టీని అందించిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విడుదలైన తరువాత తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.40 కోట్లు అని తెలిసింది.బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన సుల్తాన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజు వసూళ్లు 36 కోట్లు. కబాలి విడుదలకు ముందు వరకూ ఇదే రికార్డు. ఇప్పుడా రికార్డును కబాలి బద్దలు కొట్టిందని సమాచారం.
కాగా ఒక్క వారానికి రూ.120 కోట్ల వసూళ్లకు దాటుతుందని సినీ వర్గాల అంచనా.కాగా కబాలితో రజనీకాంత్ స్టామినా మరింత పెరిగింది.అమెరికాలో ఉన్న రజననీకాంత్ చిత్రం విడుదల ముందే చెన్నైకి తిరిగి వస్తారని భావించారు.కాగా ఇటీవల ఆయన అమెరికాలో కారులో పయనిస్తుండగా అక్కడి ప్రజల కంటపడ్డారు.అంతే వారంతా ఆనందంతో చేతులు ఊపుతూ పరుగులు తీశారు.దీంతో కారు నిలిపి వారికి ఉత్సాహంగా రజనీకాంత్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.అంతగా కబాలి ఫీవర్ పెల్లుబికిందన్న మాట.