250 కబాలి టిక్కెట్లు కొన్న ప్రముఖ నటుడు
కబాలిరా..నిప్పురా. కబాలి వచ్చాడని చెప్పు..తిరిగొచ్చాడని చెప్పు.పాత సినిమాలో బుగ్గ మీద చుక్క పెట్టుకుని ఏయ్ కబాలి అని పిలవగానే వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నార్రా.. కబాలి రా.. ఇలాంటి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే సంభాషణలతో తనదైన స్టైల్‌లో ప్రచార చిత్రంలోనే దుమ్మురేపిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చుమ్మ అదురుదిల్లే అంటూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది.
తమిళసినిమా: ట్రెండ్ సృష్టంచడం అన్నది మన సూపర్‌స్టార్‌కు కొత్తేమీకాదు.అదే బాణీలో మరోసారి బాక్సాఫీస్‌లను బద్ధలు కొట్టడానికి కబాలిగా వస్తున్నారన్న మాట. కబాలి.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నది ఈ మూడక్షరాలే. ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రపంచ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. ఇందుకు ఒకే ఒక్క తారక మంత్రం రజనీకాంత్ అనే ఐదు అక్షరాలే.తమిళం,తెలుగు,హిందీ, మలాయ్ మొదలగు నాలుగు భాషలలో ఏక కాలంలో విడుదలవుతున్న ఏకైక చిత్రం అన్న ఘనతను కబాలి చిత్రం దక్కించుకుంది.
ఒక చిత్ర విడుదల రోజున కార్పొరేట్ సంస్థలు సెలవులు ప్రకటించడమా? అంటూ కబాలి చిత్ర క్రేజ్‌ను చూసి ప్రపంచ మీడియానే అచ్చెరువు చెందుతోందంటే ఈ చిత్రం స్థాయి ఏమిటో అర్థం చేనుకోవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే కబాలి గురించి చాలా విశేషాలు ఉన్నాయి.కబాలి చిత్రం విడుదల కావడంతో తమిళనాడులోనే కాదు,పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, కర్ణాటకల్లో కొత్త చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 5000 థియోటర్లకు పైగా విడుదలవుతున్న కబాలి చిత్రం ఒక తమిళనాడులోనే 650 థియేటర్లకు పైగా విడుదల కానుంది.ఇప్పటి వరకూ ఏ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదన్నది ప్రత్యేకంగా చెప్పాలా?
అవరోధాలను చీల్చుకుంటూ
ఈ మధ్య చాలా చిత్రాలు విడుదల సమయాల్లో సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. కబాలి కూడా అలాంటి వాటిని ఎదుర్కోక తప్పలేదు.అయితే అన్ని బంధనాలను తెంచుకుని కబాలి డా అంటూ ఇక ప్రభంజనంలా తెరపైకి రానుంది.
250 టిక్కెట్లు కొన్న శింబు
కాగా సాధారణ ప్రజలే కాదు ప్రముఖ నటులు కబాలి చిత్రాన్ని మొదటి రోజున మొదటి షో చూడడానికి ఆసక్తి చూపడం అన్నది ఒక రజనీకాంత్ చిత్రానికే జరుగుతోంది.శుక్రవారం పలువురు నటులు చెన్నైలో టికెట్స్ కొని మరీ కబాలి చిత్రాన్ని చూడబోతున్నారు. నటుడు శింబు ప్రస్తుతం మదురైలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఆయన రజనీకాంత్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. శింబు తన చిత్ర యూనిట్ సభ్యులు 250 మందికి టికెట్లు కొని శుక్రవారం వారితో కలిసి మదురైలో కబాలి చిత్రాన్ని చూడనున్నారు.
అభిమానుల హంగామా
రజనీకాంత్ చిత్రం తెరపైకి వస్తుందంటే ఆయన అభిమానులు సెలైంట్‌గా ఉంటారా?పూజలు,పాలాభిషేకాలు,భారీ కటౌట్‌లు అంటూ నానా హంగామా చేయరూ*ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానుల్లో అలాంటి కోలాహలమే జరుగుతోంది.చెన్నైలో పలు ప్రాంతాలలో కబాలి చిత్రం విజ యం సాధించాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు,కటౌట్‌లకు పాలాభిషేకాలు చూస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వీరాభిమాన్ని చాటు కుంటున్నారు.
కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం అమెరికాలో అక్కడ డిస్ట్రిబ్యూటర్ల మధ్య కబాలి చిత్రాన్ని తిలకించారు.చిత్రంలో ప్రతి సన్నివేశానికి వీక్షకుల నుంచి ఈలల,చప్పట్లు పడడంతో ఆ వాతావరణాన్ని మౌనంగా,మనసులోనే ఆనందపడుతూ బయటకు వచ్చిన వెంట నే దర్శకుడు రంజిత్‌కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. దటీజ్ సూపర్‌స్టార్ అంటున్నారు సినీవర్గాలు.