ఆ సినిమా నుంచి కాజల్‌ తప్పుకుందా? | Kajal Aggarwal May Quit Kamal Hassan Indian 2 Movie | Sakshi
Sakshi News home page

నిర్ణయం తీసేసుకున్నట్టేనా?

Jun 6 2019 11:52 AM | Updated on Jun 6 2019 12:07 PM

Kajal Aggarwal May Quit Kamal Hassan Indian 2 Movie - Sakshi

తమిళసినిమా: నటి కాజల్‌ అగర్వాల్‌కు ఇప్పుడు టైమ్‌ అస్సలు బాగోలేదని చెప్పవచ్చు. ఈ అమ్మడు మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. కోలీవుడ్‌లో అజిత్‌ సరసన నటించిన వివేకం చిత్రం తరువాత కాజల్‌కు విజయమే ముఖం చాటేసిందంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లోనూ నేనేరాజా నేనేమంత్రి తరువాత సక్సెస్‌లు లేవు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఎంఎల్‌ఏ, కవచం, సీత వంటి తెలుగు చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. తమిళంలో అంతకంటే నిరాశను కలిగించిన అవకాశం ఇండియన్‌–2. నిజానికి ఈ చిత్రంలో నటించే అవకాశం రావడంతో కాజల్‌అగర్వాల్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబై పోయింది. కారణం కథానాయకుడు కమలహాసన్‌ కావడం, దర్శకుడు శంకర్‌ కావడం. ఇక ఇండియన్‌ (తెలుగులో భారతీయుడు) వంటి చిత్రానికి సీక్వెల్‌ కావడంతో ఇండియన్‌–2 తన సినీ కేరీర్‌లో మైలు రాయిగా నిలిచి పోతుందని భావించింది.

ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్‌ ఫొటో సెషన్‌లో కూడా పాల్గొంది. చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే కమలహాసన్‌ రాజకీయ రూపంలో ఇండియన్‌–2 చిత్ర నిర్మాణానికి తొలి గండి పడింది. ఆయన లోక్‌సభ ఎన్నికల పనిలో బిజీ కావడంతో ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన వివరాలేవీ లేవు. లోక్‌సభ ఎన్నికల హడావుడి  తగ్గిన తరువాత కమలహాసన్‌ బిగ్‌బాస్‌–3 పనిలో నిమగ్నమయ్యారు. ఈ రియాలిటీ షో త్వరలో ప్రసారం కానుంది. దీని కోసం కమలహాసన్‌ వారానికి రెండు రోజులు కేటాయించారు.  అలా మరో మూడు నెలల వరకూ ఆయన ఇండియన్‌–2 చిత్రం గురించి ఆలోచించేలా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసిన కాజల్‌అగర్వాల్‌ వేసారిపోయిందట. ఇక సహనం నశించవడంతో ఇండియన్‌–2 చిత్రాన్ని వదులు కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. అలా ఒక క్రేజీ చిత్రాన్ని కాజల్‌ కోల్పోవాల్సిన పరిస్థితి రావడంతో చాలా నిరాశ, నిస్పృహలకు లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్న హింది చిత్రం క్వీన్‌కు రీమేక్‌ అయిన ప్యారీస్‌ ప్యారీస్‌ విడుదలలో జాప్యం కాజల్‌ను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం జయంరవితో రోమాన్స్‌ చేస్తున్న తమిళ చిత్రం కోమాలి పైనే ఈ బ్యూటీ ఆశలన్నీ. దీనితో పాటు తెలుగులో ఒక చిత్రం మాత్రమే కాజల్‌అగర్వాల్‌ చేతిలో ఉంది. కొత్తగా అవకాశాలేమీ లేవు. మరో పక్క ఈ ముద్దుగుమ్మకు ఇంటిలో పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement