
మొదటిసారి ముగ్గురితో మహేశ్
ఇప్పటివరకూ మహేశ్‌బాబు ఇరవై చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ వరకూ చేసిన చిత్రాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో మహేశ్ రొమాన్స్ చేశారు. కానీ, ‘బ్రహ్మోత్సవం’లో ముగ్గురు నాయికలతో ఆడి, పాడనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీతలను కథానాయికలుగా ఖరారు చేశారు. కాజల్‌తో మహేశ్ ‘బిజినెస్‌మేన్’లో నటించారు. సమంతతో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో నటించారు.
ప్రణీతతో జతకట్టడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురి పాత్రలూ కథకు కీలకంగా నిలుస్తాయని శ్రీకాంత్ అడ్డాల చెబుతూ -‘‘నలుగురున్న చోట పండగ వాతావరణం ఉంటుంది. అలా, ఒక కుటుంబంలో ఎంతోమంది ఉండి, ప్రతి సందర్భాన్నీ ఓ ఉత్సవంలా జరుపుకుంటే అది ‘బ్రహ్మోత్సవం’లా ఉంటుంది. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అన్నారు. ‘‘మా సంస్థకు ఇది ప్రతిష్టాత్మకం చిత్రం. వచ్చే నెల 10 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి, 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్.