నేను ఓటు వేయను.. కమల్ | Kamal Hassan's next film to see his daughter in action | Sakshi
Sakshi News home page

నేను ఓటు వేయను.. కమల్

Apr 30 2016 3:21 AM | Updated on Sep 3 2017 11:03 PM

నేను ఓటు వేయను.. కమల్

నేను ఓటు వేయను.. కమల్

రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్నారు. ఆయన జోక్‌గా అన్న విషయం కాదు.

రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్నారు. ఆయన జోక్‌గా అన్న విషయం కాదు. పత్రికా ముఖంగానే చెప్పారు. కమలహాసన్ నటిస్తూ, రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం శభాష్‌నాయుడు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో లైక్ ప్రొడక్షన్ భాగస్వామ్యం పంచుకుంటోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకిగా శ్రుతిహాసన్ నటించడం విశేషం.

ముఖ్యపాత్రలో రమ్యకృష్ణతో పాటు బ్రహ్మానందం సౌరభ్‌శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్‌బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో కమలహాసన్, శ్రుతిహాసన్, దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా, లైక్ సంస్థ అధినేత సుభాష్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమలహాసన్ విలేకరులతో మాట్లాడుతూ ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందించనున్నట్లు చెప్పారు.

తమిళం, తెలుగు భాషలలో శభాష్‌నాయుడు, హిందీ శభాష్‌కుండు పేరును నిర్ణయించినట్లు తెలిపారు. దశావతారం చిత్రంలోని పది పాత్రలలో ఒకటైన బలరామ్‌నాయుడు పాత్ర విస్తరించే కథే శభాష్‌నాయుడు అని వివరించారు. ఇందులో తన కూతురు శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్నట్లు చెప్పారు. ఆమె చిత్రంలోనూ తనకు కూతురుగానే నటిస్తున్నారని తెలిపారు. శ్రుతితో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పలువురు విదేశీ సంగీత కళాకారులు పని చేస్తున్నట్లు వెల్లడించారు.

స్టెపప్-2 చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు తమ చిత్రానికి పని చేస్తున్నట్లు చెప్పారు. మే నెల 14 నుంచి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే నెల 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కదా! మీరు ఓటు హక్కు వినియోగించుకోరా? అన్న ప్రశ్నకు తాను ఓటు వేయను అన్నారు. కారణం తనకు ఓటు పట్టికలో తన పేరు లేదని వివరించారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని వెళితే అప్పటికే తన ఓటును వేరెవరో వేసేశారని, ఈ సారన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించగా ఓటరు పట్టికలో తన పేరే లేదన్నారని, ఎన్నికల కమిషనర్ తనకు మంచి మిత్రుడే అయినా ఏమి చేసేది అని కమల్ నిట్టూర్చారు.

నాన్నతో నటించడం గర్వంగా ఉంది: శ్రుతి
ఇలాంటి తరుణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని నటి శ్రుతిహాసన్ చెప్పారు. ఆయన తనకు ఆర్ట్, నటన, సంగీతం అన్ని నేర్పించారని ఈ చిత్రంలో నాన్న లాంటి గొప్ప నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement