కోట్లకూ లొంగని కంగన
సినిమాల్లో భారీ పారితోషికాలు... మరో వైపు వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా వచ్చే ఆదాయం, అడపాదడపా షోరూమ్‌ల ప్రారంభోత్సవాలు... ఇలా నాలుగు చేతులా తెగ సంపాదించేస్తుంటారు కథానాయికలు. లైమ్‌లైట్‌లో ఉన్న ప్రతి కథానాయికకూ ఇవి మామూలే. అయితే... బాలీవుడ్ కథానాయికలకు మరో రూపంలో కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. అదే... ‘పెళ్లి వేడుకల్లో డాన్స్’. కోటీశ్వరుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో స్టార్ హీరోయిన్ల డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఉత్తరాదిన సర్వసాధారణం. కరీనా, కత్రినా, దీపిక... ఇలా స్టార్ హీరోయిన్లందరూ ఇలా ప్రైవేటు వేడుకల్లో పదం కలిపిన వారే.
ఇలా డాన్స్ చేయడం వల్ల సదరు కథానాయికలకు భారీ మొత్తంగా పారితోషికాలు అందుతూ ఉంటాయి. ఇటీవలే ఇలాంటి అవకాశమే ‘క్వీన్’ కంగనా రనౌత్ తలుపు తట్టింది. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి కార్యక్రమంలో డాన్స్ చేస్తే... మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినా... అంతటి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట కంగనా. ‘క్వీన్’ తర్వాత కంగనా ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో... ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో కంగనాతో డాన్స్ చేయించాలని ఉత్తరాదిన చాలామంది పోటీ పడుతున్నారట. అయితే... కంగనా మాత్రం ‘నేను చేయను’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారని స్వయానా కంగనా సోదరి రంగోలి ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ‘క్వీన్’కి ముందు కూడా కంగనాకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయని, అయితే... ఆమె మాత్రం వేటికీ అంగీకారం తెలుపలేదని, కంగనా దృష్టి మొత్తం పాత్రలపైనే ఉంటుందని రంగోలి అన్నారు.