కంగనా రనౌత్ (నటి) రాయని డైరీ
పెళ్లంటే ఇంట్రస్ట్ లేని అమ్మాయిపై.. పెళ్లయిన మగాళ్లకు ఎక్కడలేని ఇంట్రస్ట్ కలుగుతుంది! ఆ పిల్ల ధైర్యంపై వీళ్లు బతికేయొచ్చు కదా.. అందుకు. ‘నీ మీద ఉన్నది లస్ట్ కాదు.. లవ్’ అని మొదలుపెట్టేస్తారు. జాగ్రత్తగా లవ్ చేస్తారు. నెక్ టై వదులైనట్టు కూడా కనిపించదు. పాపం ఏం చేస్తారు మరి! సాయంత్రానికల్లా ఇంటికి చేరాలి. జెంటిల్మన్‌లా చేరాలి. అక్కడ మళ్లీ పెళ్లాన్ని లవ్ చెయ్యాలి.
రాత్రి షూటింగ్ నుంచి వచ్చేసరికి బాగా లేటయింది. బతికిపోయాను! నా కోసం ఎదురు చూస్తూ ఉండే మగదిక్కు ఒకడు నా ఇంట్లో లేడు. నేను, నా ఇల్లు. అందులో స్వామీ వివేకానంద, స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు పుస్తకాలు, కథక్ డ్యాన్స్ సరంజామా, ఫ్రిజ్‌లో కొన్ని ఆకుకూరలు, హాయిగా తలదిమ్మంతా వదిలించుకోడానికి శుభ్రమైన స్నానాల గది. మనిషిగా ఎదగడానికి, నేర్చుకోడానికి ఒక సామాన్యురాలిగా నాకున్న హక్కును వదులుకోవలసి వస్తే సినిమాల నుండి బయటికి వచ్చేస్తాను తప్ప, నా ఇంటిని వదిలి నేను ఎక్కడికీ వెళ్లను.
రంగూన్ సెట్‌లో సైఫ్ పెట్టిన చికాకు గుర్తొచ్చి మళ్లీ ఇంకోసారి స్నానం చేయాలనిపిస్తోంది. రెండు పెళ్లిళ్లు అయినవాడిలో అంత బుద్ధిహీనత ఏమిటో?! పడగ్గది సీన్‌లో యాక్ట్ చేస్తున్నాం ఇద్దరం. కెమెరా అతడి ముఖం మీదకు జూమ్ అయింది. యాక్ట్ చెయ్యాలి. చెయ్యట్లేదు. నా వైపు తిరిగి పిచ్చిపిచ్చి ఫీలింగ్స్ పెట్టేస్తున్నాడు! డిజ్‌గస్టింగ్. ఇంపార్టెంట్ సీన్‌లో ఒక ప్రొఫెషనల్ అలా ఎలా ఉంటాడు? పెద్దగా అరిచేశాను. విశాల్ పరిగెత్తుకొచ్చాడు. ‘రిలాక్స్ కంగనా.. సైఫ్ ఈజ్ జస్ట్ జోకింగ్’ అంటాడు.
రిలాక్స్‌డ్‌గా ఉండనిస్తారా ఈ మగాళ్లు! నాలుగు రోజులు కలిసి పనిచేస్తే చాలు.. ‘నీకోసం ఏమైనా చేసేస్తా’నని ఇంట్లోంచి చాప, దిండు పట్టుకొచ్చేస్తారు.. నా భార్య నా పక్కనే ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావని! ఆదిత్య నా గాడ్‌ఫాదర్. నాకన్నా ఇరవై ఏళ్లు పెద్ద. ‘నువ్వు లేకుండా నేను లేను’ అన్నాడు ఓ రోజు.. వాళ్ల ఆవిడ లేకుండా చూసి! ‘నీకు నేనున్నాను’ అన్న పెద్ద మనిషి ‘నువ్వు లేకుండా నేను లేను’ అంటున్నాడు! టార్చర్. బయటికి వచ్చేశాను. ఇప్పుడు హృతిక్! నా ఈ మెయిళ్లు, నా పర్సనల్ ఫొటోలు ముంబై అంతా పంచిపెడుతున్నాడు. ప్రేమ కోసం నేను అతడిని వేధించానని తన భార్యను నమ్మించడానికి ఇవన్నీ అతడు పోగేసుకున్న సాక్ష్యాలు, ఆధారాలు! నవ్వొస్తోంది.
మనిషంటే నికోలాస్! ఇంగ్లిష్ డెరైక్టర్. కొన్నాళ్లు కలిసి ఉన్నాం. ‘ఎప్పటికీ కలిసే ఉందాం’ అన్నాడు ఒక రోజు. ‘పెళ్లిలో పడడం నాకిష్టం లేదు’ అని చెప్పాను. ఈ పెళ్లయిన మగాళ్లలా అతడు హర్ట్ అవలేదు. బై చెప్పాడు. నవ్వుతూ చెప్పాడు! ఒక ‘మోస్ట్ నార్మల్’ రిలేషన్‌షిప్ చుట్టూ అందమైన ప్రేమ గూడు కట్టుకునేది కాన్ఫిడెన్స్ లేని మగాళ్లే. గుండెల నిండా ప్రేమను కోరుకునే అమ్మాయిలకు ఆ ప్రేమగూడులో ఊపిరితిత్తులు పనిచేయవు!