
దాదాపు పదమూడేళ్ల క్రితం కంగనా రనౌత్‌కు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్‌స్టర్’ (2006) సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటిగా తనను తాను నిరూపించుకున్న కంగనా రనౌత్ బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయారు. గత ఏడాది అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న ‘ఇమాలీ’ (వర్కింగ్‌ౖ టెటిల్ అట) సినిమాలో నటించనున్నట్లు కంగన ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకున్నారామె. ‘ఇమాలీ’లో నటించడం లేదని స్పష్టం చేశారు. దానికిగల కారణాన్ని కంగన చెబుతూ – ‘‘ఇమాలీ’ మంచి ప్రేమకథా చిత్రం. గత ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సింది.
నేను ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాతో చాలా బిజీగా ఉండటంతో కుదర్లేదు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా ‘పంగా’ను స్టార్ట్ చేశాం. ఇటీవల ‘జయ’ (ప్రముఖ నటి, తమిళనాడు మాజీ సీయం జయలలిత బయోపిక్ హిందీ టైటిల్)కు సైన్ చేశాను. త్వరలో నా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేశాం. ఇలా చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి సమయం లేదు. అందుకే అనురాగ్ బసుతో సినిమా చేయడం లేదు. ఈ విషయం గురించి ఆయనతో కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పంగా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు కంగన.